Share News

బీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:49 PM

బీఆర్‌ఎస్‌ హయాంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని.. ఫాక్స్‌కాన్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి లక్ష మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి
దసరా సమ్మేళనంలో మాట్లాడుతున్న కేటీఆర్‌

దసరా సమ్మేళనంలో కేటీఆర్‌

ఆదిభట్ల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్‌ హయాంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని.. ఫాక్స్‌కాన్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి లక్ష మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బొంగ్లూరులోని ప్రమిద కన్వెన్షన్‌లో నిర్వహించిన దసరా సమ్మేళనంలో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి కోసం మంచిరెడ్డి అహర్నిశలు కృషి చేసినట్లు గుర్తు చేశారు. ఆయన ఏనాడూ వ్యక్తిగత పనుల నిమిత్త రాలేదని, కేవలం అభివృద్ధి నిధుల కోసమే వచ్చేవారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించుకోలేకపోయామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. కొంగరకలాన్‌లో కలెక్టరేట్‌ ఏర్పాటుతో ప్రారంభమై.. ఫాక్స్‌కాన్‌, గ్రీన్‌ ఫార్మాసిటీ సంస్థల ఏర్పాటుతో లక్షలాది ఉద్యోగాల కల్పనకు ఇబ్రహీంపట్నం వేదికైనట్లు చెప్పుకొచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసిన మంచిరెడ్డిని ఓడించి.. వసూల్‌ రాజాగా పేరున్న గోల్‌మాల్‌ రెడ్డిని గెలిపించారని పరోక్షంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేరును ప్రస్తావించారు. రైతుబంధు, రైతుబీమా, రైతుభరోసా ఇవ్వకుండా రైతులను అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. తమది భారత రాష్ట్ర సమితి కాదని, భారత రైతు సమితిగా సంబోధిస్తూ రైతుల పక్షాన నిలుస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండేవని, మళ్లీ ఆ రోజులు వచ్చేలా కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలలో కష్టపడి పనిచేయాలని సూచించారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కష్టాలు మొదలయ్యాయన్నారు. రాబోయే రోజులలో బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్‌ అభివృద్ధి సంక్షేమ పాలననూ చూస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ తాము ప్రజల కోసం కొట్లాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేశామని, ఇప్పుడున్న ఎమ్మెల్యేకు అహంకారం ఎక్కువ అన్నారు. ఆయన ప్రభుత్వాన్ని నిధులు అడగలేక పోతున్నారన్నారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి పట్టించుకోకుండా మంత్రి పదవి కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము రూ.470 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించి ప్రొసీడింగ్స్‌ ఇస్తే, ఎమ్మెల్యే కనీసం నిధులు విడుదల చేయించుకోలేక పోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్‌, మంచిరెడ్డి ప్రశాంత్‌ కుమార్‌ రెడ్డి, సత్తు వెంకటరమణా రెడ్డి, లక్ష్మారెడ్డి, చీరాల రమే్‌ష, నిట్టు జగదీష్‌, రమేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 11:49 PM