Share News

సర్కారు కాలేజీల్లో తగ్గిన ఉత్తీర్ణత

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:49 PM

ప్రభుత్వ కాలేజీల్లో ఈసారి ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం తగ్గిపోయింది. ఏటేటా ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు కూడా తగ్గిపోతున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షలు పూర్తికావడమే ఆలస్యం.. తమ పిల్లలను ప్రైవేటు/కార్పొరేట్‌ కాలేజీల్లో చేర్పించేందుకే తల్లిదండ్రులు సంసిద్ధమవుతున్నారు.

సర్కారు కాలేజీల్లో తగ్గిన ఉత్తీర్ణత

ఏటేటా ఇంటర్‌లో అడ్మిషన్లూ తక్కువే..

ప్రైవేటు/కార్పొరేట్‌ కాలేజీలకే విద్యార్థుల మొగ్గు

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య కరువు!

సకల సౌకర్యాలున్నా.. ఉత్తీర్ణత శాతం అంతంతే!

ప్రభుత్వ కాలేజీల్లో ఈసారి ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం తగ్గిపోయింది. ఏటేటా ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు కూడా తగ్గిపోతున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షలు పూర్తికావడమే ఆలస్యం.. తమ పిల్లలను ప్రైవేటు/కార్పొరేట్‌ కాలేజీల్లో చేర్పించేందుకే తల్లిదండ్రులు సంసిద్ధమవుతున్నారు. సర్కారు కళాశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దానికి తగ్గట్టుగానే విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం కూడా ఏటేటా తగ్గిపోతోంది. ఎంత ఖర్చయినా సరే ప్రైవేటు కాలేజీలో చదువుకునేందుకే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఈ యేడాది జిల్లాలో ఇంటర్‌ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ కాలేజీ ఒక్కటి కూడా లేదు. కాగా, ఫస్టియర్‌ కంటే సెకండియర్‌లో ఉత్తీర్ణత శాతం కాస్త మెరుగ్గా ఉంది.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 25) : ఇంటర్‌ ఫలితాల్లో సర్కారు జూనియర్‌ కాలేజీలు డీలాపడ్డాయి. ఫస్టియర్‌, సెకండియర్‌లోనూ ప్రైవేట్‌ కాలేజీలతో పోల్చుకుంటే.. అట్టడుగు స్థాయి చేరుకున్నాయి. ప్రభుత్వ కాలేజీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ.. ఫలితాల్లో మాత్రం క్షీణిస్తున్నాయి. ఎంతో అనుభవం గల అధ్యాపకులు ఉన్నప్పటికీ.. ఫలితాల సాధనలో ఎందుకు పరుగులు పెట్టలేకపోతున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. లోపం ఎక్కడుంది? ఎందుకు విద్యార్థులు చదువులో రాణించలేక పోతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు పట్టించుకోపోవడంతోనే రోజురోజుకూ ప్రభుత్వ కాలేజీల్లో విద్యాప్రమాణాలు దిగజారిపోతున్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ కాలేజీలు అంటే ఎంతో క్రేజ్‌ ఉండేది. ప్రతీ ఒక్కరు ప్రభుత్వ కాలేజీలోనే చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకునేవారు. అలాంటి వారు ఎందరో ఉన్నారు కూడా. కానీ, ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలంటేనే వామ్మో అని అంటున్నారు. గతంలో గవర్నమెంట్‌ కాలేజీలో సీటు కోసం పరితపించేవారు. నేడు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు, ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నప్పటికీ.. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఓపక్క ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు తగ్గిపోతుండగా, చేరిన వారిలోనూ పాస్‌ అవుతున్న వారిసంఖ్య దారుణంగా పడిపోతోంది. ఇక్కడ చదివే వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవర్గాల పిల్లలే. వారికి నాణ్యమైన విద్యనందించి, పైచదువులకు పంపించాల్సిన సర్కారు.. ఇంటర్‌తోనే సరిపెడుతోంది. ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంటర్‌తోనే చదువుకు దూరమవుతున్నారు. ఇందుకు ప్రభుత్వ విధానాలతో పాటు వివిధ కారణాలు ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లాలో మొత్తం 17 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలున్నాయి. ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాల్లో కనీసం ఏ ఒక్క కాలేజీ కూడా వందశాతం ఉత్తీర్ణత సాధించలేదు. 50 శాతం ఉత్తీర్ణత సాధించిన కాలేజీల పేర్లను వేళ్లపై లెక్కించవచ్చు. మాడ్గుల జూనియర్‌ కాలేజీ ఫస్టియర్‌లో 80.47 శాతం ఉత్తీర్ణత మాత్రమే సాధించారు. అలాగే మంచాల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 50 శాతం, ఫరూక్‌నగర్‌ జూనియర్‌ కాలేజీ 53.54 శాతం, కేశంపేట మండలం కొత్తపేట జూనియర్‌ కాలేజీలో 62.5 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఫస్టియర్‌ ఫలితాల్లో వెనుకబడిన కాలేజీలు..

ఫస్టియర్‌ ఫలితాల్లో చాలావరకు కాలేజీలో వెనుకబడ్డాయి. జనరల్‌, ఒకేషనల్‌ కలుపుకొని ఫలితాలను పరిశీలిస్తే.. హయత్‌నగర్‌ జూనియర్‌ కాలేజీలో 18.91 శాతం, సరూర్‌నగర్‌ కాలేజీలో 31.82 శాతం, ఇబ్రహీంపట్నం కాలేజీలో 24.68 శాతం, ఆమనగల్లు కాలేజీలో 37.04 శాతం, షాద్‌నగర్‌ జూనియర్‌ కాలేజీలో 46.32 శాతం, కందుకూరు కాలేజీలో 39.13 శాతం, యాచారం జూనియర్‌ కాలేజీలో 29.09 శాతం, రాయదుర్గంలో 24.94 శాతం, రామచంద్రపుర కాలేజీలో 32.27 శాతం, రాజేంద్రనగర్‌ జూనియర్‌ కాలేజీలో 39.08 శాతం, మహేశ్వరం కాలేజీలో 25.68 శాతం, శంషాబాద్‌ జూనియర్‌ కాలేజీలో 38.46 శాతం, చేవెళ్ల జూనియర్‌ కాలేజీలో 41.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

సెకండియర్‌లో కొంత మెరుగు!

ఫస్టియర్‌ ఫలితాలు ఆధ్వానంగా ఉన్నాయి. కానీ, ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు కొంతలో కొంత మెరుగ్గా ఉన్నాయి. ఎనిమిది కాలేజీల్లో విద్యార్థులు 50 శాతం కంటే ఎక్కువ ఫలితాలు సాధించారు. చేవెళ్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 60.57 శాతం, కందుకూరు జూనియర్‌ కాలేజీలో 65.06 శాతం, కేశంపేట జూనియర్‌ కాలేజీలో 68.18 శాతం, షాద్‌నగర్‌ జూనియర్‌ కాలేజీలో 66.09, ఫరూక్‌నగర్‌ జూనియర్‌ కాలేజీలో 65.79 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ఆమనగల్లు జూనియర్‌ కాలేజీలో 76.06 శాతం, మాడ్గులలో 84.4, మంచాలలో 72.48 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇదిలా ఉండగా, ఇంటర్‌ సెకండియర్‌లో కొన్ని కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం ఘోరంగా పడిపోయింది. జనరల్‌ విద్యార్థులతో పాటు ఒకేషనల్‌ కోర్సు కలుపుకొని ఉత్తీర్ణతను పరిశీలిస్తే.. శంషాబాద్‌ జూనియర్‌ కాలేజీలో 39.71 శాతం నమోదైంది, అలాగే మహేశ్వరం జూనియర్‌ కాలేజీలో ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది. కేవలం 18.91 శాతం నమోదైంది. రాజేంద్రగన్‌ కాలేజీలో 32.34 శాతం, రామచంద్రపురంలో 38.56, రాయదుర్గంలో 39.28, యాచారంలో 44.44, ఇబ్రహీంపట్నంలో 41.55, సరూర్‌నగర్‌లో 36.46, హయత్‌నగర్‌లో 32.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

సత్తా చాటిన కేజీబీవీ విద్యార్థులు

ఇంటర్‌, ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాల్లో కస్తూర్భా విద్యార్థినులు సత్తా చాటారు. జిల్లాలో 20 కేజీబీవీలు ఉండగా.. పదింటిలో ఇంటర్‌ స్థాయి విద్యను అందిస్తున్నారు. ఫరూక్‌నగర్‌ కేజీబీవీలో ఎంపీసీ, బైపీసీ ఫస్టియర్‌లో 83.01 ఉత్తీర్ణత సాధించారు. ఇబ్రహీంపట్నంలోని కేజీబీవీలో ఎంపీసీ, బైపీసీలో 80.30 శాతం, శంషాబాద్‌లోని కేజీబీవీ ఎంపీసీ, బైపీసీలో 54 శాతం, కొందుర్గు కేజీబీవీ సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యు కోర్సుల్లో 86.50 శాతం, శంకర్‌పల్లిలోని కేజీబీవీ సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యులో 75 శాతం, మహేశ్వరంలోని కేజీబీవీ సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యు కోర్సులో 74 శాతం, కందుకూరులోని కేజీబీవీలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యువో కోర్సులో 69 శాతం, కొత్తూరు కేజీబీవీలో 65, మంచాలలో77, షాబాద్‌లో 86, కేశంపేటలో 89.74 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

మంచాల కేజీబీవీలో 100 శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌ సెకండియర్‌లో మంచాల కేజీబీవీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ కాలేజీలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. దాంతో తోటి కేజీబీలకు ఆదర్శంగా నిలిచింది. సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యు గ్రూప్‌లో 26 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా 26 పాస్‌ అయ్యారు. దీని తర్వాత స్థానంలో కేశంపేట కేజీబీవి నిలిచింది. 77 మంది విద్యార్థులకు 73 మంది పాసయ్యారు. 94.81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కొందుర్గులో 47 మంది విద్యార్థినులకు 43 మంది పాస్‌ అయ్యారు. 91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫరూక్‌నగర్‌లోని కేజీబీవీలో ఎంపీసీ, బైపీసీ విభాగంలో 53 మంది విద్యార్థినులకు 48 మంది పాసయ్యారు. 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 68 శాతం, శంషాబాద్‌లో 82, శంకర్‌పల్లిలో 73, మహేశ్వరంలో 81, కందుకూరులో 86 శాతం, కొత్తూరులో 73 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మెరిసిన మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు

మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో ప్రైవేట్‌ కాలేజీలకు దీటుగా మంచి ఫలితాలు సాధించారు. జిల్లాలో 9 తెలంగాణ మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. ఇంటర్‌ ఫస్టియర్‌కు సబంధించి చేవెళ్లలోని మోడల్‌ స్కూల్‌లో 73 శాతం, పాల్మాకులలో 50 శాతం, టీఎస్‌ మోడల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీలో 69 శాతం, గున్‌గల్‌లో 55.32 వాతం, ఆరుట్లలో 51 శాతం, నేదునూరులో 51 శాతం, శంకర్‌పల్లిలో 41 శాతం, మహేశ్వరంలో 60.7 శాతం, ఇబ్రహీంపట్నంలో 36.61 శాతం నమోదైంది.

టాప్‌లో నిలిచిన శంషాబాద్‌ మోడల్‌ కాలేజీ

ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో 802 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 565 మంది పాసయ్యారు. 70.45 శాతం ఉత్తీర్ణత నమోదై శంషాబాద్‌ మోడల్‌ స్కూల్‌ జిల్లాలో టాప్‌లో నిలిచింది. 86 మంది విద్యార్థులకు 75 మంది పాసయ్యారు. 87.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. చేవెళ్లలో 83.81, పాల్మాకులలో 75 శాతం, గున్‌గల్‌లో 53.85, నేదునూరులో 66.67, శంకర్‌పల్లిలో 54.39, మహేశ్వరంలో 65.42, ఆరుట్లలో 77.94 శాతం, ఇబ్రహీంపట్నంలో 54.43 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Updated Date - Apr 25 , 2024 | 11:49 PM