Share News

కంది సాగు ఆశాజనకం

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:42 PM

చేవెళ్ల డివిజన్‌ పరిధిలో రైతులు కంది పంటను అధికంగా సాగు చేశారు. ఈ ఏడాది కురిసిన వానలను తట్టుకొని పంట ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది.

కంది సాగు ఆశాజనకం

పూత, కాత దశలో పంట

చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 70,761 ఎకరాల్లో సాగు

క్వింటాల్‌కు రూ.1,250

మద్దతు ధర పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

రైతులను భయపెడుతున్న పురుగు ఉధృతి

పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు

చేవెళ్ల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో రైతులు కంది పంటను అధికంగా సాగు చేశారు. ఈ ఏడాది కురిసిన వానలను తట్టుకొని పంట ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. చేవెళ్ల మండలంలో 6087 ఎకరాలు, షాబాద్‌ మండలంలో 4956, శంకర్‌పల్లిలో 6019, మొయినాబాద్‌లో 5369 ఎకరాల్లో కంది సాగైనట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. పత్తి, కూరగాయల సాగులో అంతర పంటగా కందిని సాగు చేశారు. పంటను చీడపీడల నుంచి కాపాడుకోవడానికి రైతులు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. అధిక వర్షాల కారణంగా మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటల దిగుబడి తగ్గడంతో కంది పంటపైనే ఆశలు పెట్టుకున్నారు.

పెరిగిన మద్దతు ధర

ప్రభుత్వం కందికి మద్దతు ధర పెంచింది. గత ఏడాది ధర క్వింటాలుకు రూ. 6300 ఉండగా, ఈ ఏడాది రూ.7550గా ప్రకటించింది. పత్తి కంటే కందికే ఎక్కువ ధర ఉంది. అయితే ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

పచ్చ పురుగు బెడద

కంది పంట మొగ్గ, పూత దశలో ఉండటంతో పచ్చ పురుగు ఉధృతి పెరిగిపోతుంది. ఆకులను గూళ్లుగా కట్టుకొని పంటపై దాడి చేస్తున్నాయి. దీనికి తోడు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చీడపీడల బెడద పెరిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట రక్షణకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వ్యవసాయ శాఖ అధికారుల జాడ కనిపించడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో పర్యటించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.

సలహాలు, సూచనలివ్వాలి

ఈ ఏడాది కంది పంట బాగుంది. దిగుబడులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. పంటలో పురుగు ఉధృతి కనిపిస్తుంది. పంటను కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా రైతులకు సలహాలు సూచనలు ఇస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది.

పడమటి వెంకటేశ్‌, రైతు, చేవెళ్ల మండలం

Updated Date - Oct 25 , 2024 | 11:42 PM