క్రైం రన్!
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:58 PM
ఈ యేడాది వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజురోజుకూ ఘోరాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ప్రధాన రహదారులతో పాటు చిన్నపాటి రోడ్లు రక్తం మరిగాయి.

రోడ్డు ప్రమాదాలు.. దొంగతనాలు అధికం
వికారాబాద్‌లో తగ్గిన మృతుల సంఖ్య
మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువే
తగ్గిన దోపిడీ కేసులు 8 పెరిగిన హత్యాయత్నాలు
శామీర్‌పేట పెద్ద చెరువులో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
కొత్తూరు చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు దుర్మరణం
ఈ యేడాది వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజురోజుకూ ఘోరాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ప్రధాన రహదారులతో పాటు చిన్నపాటి రోడ్లు రక్తం మరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మేడ్చల్ జిల్లా కొల్తూరు చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మరణించడంతో ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. ఆ చిన్నారుల మరణంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శామీర్‌పేట పెద్ద చెరువులో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జిల్లా పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, వాడకం కూడా బాగా పెరిగింది. ప్రమాదాల నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు.
వికారాబాద్/మేడ్చల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గత ఏడాదితో పోలిస్తే వికారాబాద్ మేడ్చల్ జిల్లాల్లో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వికారాబాద్ జిల్లాలో 2023లో మొత్తం 1,970 కేసులు నమోదైతే, 2024లో డిసెంబరు 25వ తేదీ వరకు 2,301 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో 331 కేసులు పెరిగాయి. జిల్ల్లాలో ప్రధానంగా హత్యలు, హత్యాయత్నాలు తగ్గగా, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, ఆత్మహత్యకు ప్రేరేపించే సంఘటనలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు కూడా పెరిగాయి. కాగా, గత ఏడాదితో పోలిస్తే దోపిడీ సంఘటనలు తగ్గాయి. రోడ్డు ప్రమాదాల కేసులు గత ఏడాది 326 నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 327 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో వాహనదారులు మృత్యువాత పడిన కేసులు గత ఏడాది 189 ఉండగా, ఈసారి 154 కేసులకు తగ్గాయి. రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాది 189 మంది మృతి చెందగా, ఈసారి 148 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే, మహిళలపై జరిగే అఘాయిత్యాల కేసులు పెరిగాయి. జిల్లా పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారిన కేసులను చేధించడంలో సీసీఎస్ పోలీసులు ముఖ్య భూమిక పోషించారు. ఇంతకు ముందు పనిచేసిన ఎస్పీ కోటిరెడ్డి, ప్రస్తుత ఎస్పీ నారాయణరెడ్డిల నేతృత్వంలో షికార్ గ్యాంగ్‌తో పాటు చైన్ స్నాచింగ్, మణప్పురం మేనేజర్ కుచ్చుటోపీ వంటి కీలకమైన కేసులను చాకచక్యంగా చేధించగలిగారు.
షికార్ గ్యాంగ్ అరెస్టు...
తండ్రీ, కొడుకు, కూతురు భర్త కలిసి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవారు. ఈ ముగ్గురిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చేసిన దొంగతనాలపై 150 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇళ్లల్లో జరిగిన దొంగతనాలపై విచారణ జరిపిన సీసీఎస్ పోలీసులు షికార్ గ్యాంగ్‌గా గుర్తించారు. ఇతర రాష్ట్రాల పోలీసులకు కూడా సవాల్‌గా మారిన షికార్ గ్యాంగ్‌ను సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంతయ్య బృందం పూనేలో అరెస్టు చేశారు.
సవాల్‌గా మారిన చైన్ స్నాచర్ అరెస్టు..
మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన చైన్ స్నాచర్‌ను జిల్లా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కులకచర్ల, వికారాబాద్, బొంరా్‌సపేట పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలకు హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టకు చెందిన జావీద్ కారణమని సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంతయ్య గుర్తించారు. నిందితుడు తన ఆచూకీని ఎవరు గుర్తించకుండా ఉండేందుకు ఎక్కడ కూడా సెల్‌ఫోన్ వాడకుండా జాగ్రత్త పడేవాడు. జావీద్ కదలికలపై నిఘా వేసిన సీపీఎస్ బృందం బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్‌లో అతడిని అరెస్టు చేసింది. జావీద్‌పై తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 159 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి.
మణప్పురం కేసు చేధించిన సీసీఎస్ పోలీసులు...
పోలీసులకు సవాల్‌గా మారిన మణప్ఫురం కేసును సీసీఎస్ పోలీసులు చేధించారు. వికారాబాద్ పట్టణంలోని మణఫ్పురం గోల్డ్ లోన్ బ్యాంకులో మేనేజర్‌గా పని చే సిన విశాల్ రూ.1.24 కోట్లు కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నించారు. వినియోగదారులు బ్యాంకులో తనఖా పెట్టుకున్న బంగారు ఆభరణాలపై పలుమార్లు రుణం తీసుకుంటూ సొమ్ము చేసుకుని పరారయ్యాడు. దీంతో ఆ బ్యాంకులో బంగారు ఆభరాలు తనఖా పెట్టి రుణం తీసుకున్న వారు ఎంతో ఆందోళనకు గురయ్యారు. బీదర్ జిల్లా, ఔరాద్‌కు చెందిన విశాల్‌ను జిల్లా ఎస్పీ నేతృత్వంలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంతయ్య బృందం బెల్గాంలో అరెస్టు చేశారు.
అక్రమార్కులపై టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం
అక్రమ కార్యకలాపాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు బృందం జిల్లాలో పలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కల్లు తయారీలో వినియోగించే క్లోరల్ హైడ్రేడ్‌ను పెద్ద ఎత్తున బొంరా్‌సపేట్ మండలంలో స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో 20 క్వింటాళ్ల స్వాధీనం చేసుకున్న ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మేడ్చల్ జిల్లాలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు...
గత ఏడాదితో పోలిస్తే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. జిల్లాలో నేరాల అదుపునకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నా జిల్లాలో ఉపాధి కోసం పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుండి వలసలు పెరుగుతుండటంతో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. అదేవిధంగా అదృశ్యం కేసులు కూడా ఈ ఏడాది పెద్దఎత్తున నమోదయ్యాయి. గంజాయి, గుట్కా కేసలు కూడా పెద్ద ఎత్తున నమోదౌతున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారు పెద ్ద ఎత్తున గంజాయి, గుట్కాల రవాణాకు పాల్పడుతున్నారు. పలుమార్లు జిల్లాలోని ఔటర్ రింగు రోడ్డు వద్ద చేపట్టిన తనిఖీల్లో పోలీసులు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఏడాది కొల్తూరు చెరువులో నలుగురు చిన్నారులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. గజ్వేల్‌కు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి శామీర్‌పేట పెద్ద చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఓ రియల్ వ్యాపారికి చెందిన రూ. 2.5కోట్లు డ్రైవర్ స్నేహితుడు దొంగతనానికి పాల్పడగా పోలీసులు నాలుగు రోజుల్లో కేసును ఛేదించారు.