క్రైం రన్!
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:47 PM
జిల్లా రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2024 సంవత్సరానికి సంబంధించి మొత్తం 9,980 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదిలో నమోదైన మొత్తం కేసులను పరిశీలిస్తే ఈ సారి వీటి సంఖ్య ఎక్కువగానే ఉంది.

జిల్లాలో ఈ ఏడాది పెరిగిన నేరాలు
అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు.. వందల సంఖ్యలో మృతులు
మహిళలపై అధికమైన అత్యాచారాలు, లైంగిక వేధింపులు
పెరిగిన దొంగతనాలు, హత్యలు
తగ్గిన దోపిడీ, కిడ్నాప్ కేసులు
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లా రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2024 సంవత్సరానికి సంబంధించి మొత్తం 9,980 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదిలో నమోదైన మొత్తం కేసులను పరిశీలిస్తే ఈ సారి వీటి సంఖ్య ఎక్కువగానే ఉంది. చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్, షాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో మొత్తం 2,446 కేసులు నమోదు కాగా, ఇబ్రహీంపట్నం పరిధిలోని ఇబ్రహీంపట్నం, యాచారం, ఆదిభట్ల, మంచాల, హైదరాబాద్ గ్రీన్‌ఫార్మాసిటీ మాడ్గుల పోలీస్టేషన్ పరిధిలో మొత్తం 2,425 కేసులు నమోదయ్యాయి. అలాగే మహేశ్వరం, కందుకూరు పీఎస్ పరిధిలో 703 కేసులు నమోదు కాగా... షాద్‌నగర్, కొందుర్గు, కొత్తూరు, చౌదరిగూడ, మాడ్గుల పరిధిలో 1,736 కేసులు నమోదయ్యాయి. శంషాబాద్‌లోని రెండు పోలీ్‌సస్టేషన్లలో మొత్తం 1,703 కేసులు నమోదయ్యాయి.
నెత్తురోడిన రోడ్లు..
జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తుంది. గతేడాది జిల్లాలో 997 రోడ్డు ప్రమాదాలు జరగగా, ఈ సారి ఆ సంఖ్య 1,394కు చేరింది. అత్యధికంగా 307 రోడ్డు ప్రమాదాలు చేవెళ్ల పరిధిలోనే చోటు చేసుకున్నాయి. బీజాపూర్ (163) హైవే అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి సింగిల్ రోడ్డుగా ఉండటంతో నిత్యం ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రోడ్డు విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కారి శంకుస్థాపన చేసి 30 నెలలు దాటినా సర్వేలు, భూసేకరణ పనులకే పరిమితమయ్యాయి. ఈ రహదారి దూరం 46 కిలో మీటర్లు కాగా.. 290 గుంతలు, 25 పెద్ద గుంతలు, 265 చిన్న గుంతలు, 66 మలుపులు, 19 డేంజర్ స్పాట్లు ఉన్నాయి. చేవెళ్ల మండలం ఆలూరు గేట్ వద్ద డిసెంబరు 2వ తేదిన రైతులపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. జిల్లా వ్యాప్తంగా జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 430 మంది మరణించారు. అత్యధికంగా ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల పరిధిలోనే మృతుల సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది.
అతివలపై ఆగని హత్యలు, అత్యాచారాలు..
మహిళ, ఆడపిల్లల రక్షణకు ఎన్ని చట్టాలు తెచ్చినా ఫలితం లేకుండా పోతుంది. వారిపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో గత ఏడాది హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ.. మళ్లీ ఈ ఏడాది పెరిగాయి. పోయిన సంవత్సరం 29 హత్య కేసులు నమోదు కాగా, ఈ సారి 36 కేసులు నమోదయ్యాయి. అందులో చేవెళ్ల డివిజన్‌లో 6, ఇబ్రహీంపట్నం పరిధిలో 7, మహేశ్వరంలో 2, షాద్‌నగర్‌లో అత్యధికంగా 8 హత్య కేసులు నమోదయ్యాయి. హత్యాచారాలకు సంబంధించి గత ఏడాది 112 కేసులు నమోదు కాగా, ఈ సారి ఆ సంఖ్య 116కు చేరింది. అత్యధికంగా చేవెళ్ల డివిజన్ పరిధిలో 41, అత్యల్పంగా తలకొండపల్లిలో ఒక కేసు నమోదైంది. ఆ తర్వాత షాద్‌నగర్ పరిధిలో 16, ఇబ్రహీంపట్నలో 16 కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తుంది. మహేశ్వరంలో 4, కందుకూరులో 3 కేసులు నమోదయ్యాయి.
రెచ్చిపోయిన దొంగలు..
జిల్లా వ్యాప్తంగా రూరల్ పరిధిలో మొత్తం దొంగతనాల కేసులు 1055 నమోదు కాగా, అందులో అత్యధికంగా చేవెళ్ల డివిజన్ పరిధిలో 306 కేసులున్నాయి. తర్వాత ఇబ్రహీంపట్నం పరిధిలో 257, శంషాబాద్ ఎయిర్‌పోర్టు పీఎస్ పరిధిలో 148, శంషాబాద్ పీఎస్ పరిధిలో 110, మహేశ్వరంలో 53, కందుకూరులో 20, షాద్‌నగర్‌లో 70 కడ్తాల్‌లో 44, తలకొండపలల్లిలో 21 కేసులున్నాయి.
తగ్గిన దోపిడీలు..
గత ఏడాది కంటే ఈ సారి దోపిడీ కేసుల సంఖ్య చాలా వరకు తగ్గింది. గత సంవత్సరం 179 దోపిడీ కేసులు నమోదు కాగా... ఈసారి 35 కేసులు నమోదయ్యాయి. అందులో ఇబ్రహీంపట్నంలో పరిధిలో అత్యధికంగా 12, షాద్‌నగర్‌లో 8 కేసులు నమోదయ్యాయి. మిగితా పోలీ్‌సస్టేషన్లలో ఒకటి రెండు చొప్పున నమోదయ్యాయి.
పెరిగిన లైంగిక వేధింపులు, ఆత్మహత్యలు
మహిళలపై లైంగిక వేధింపులు గత ఏడాది కంటే ఈసారి మరింతగా పెరిగాయి. గత ఏడాది జిల్లాలో 125 కేసులు నమోదు కాగా, ఈసారి ఆ సంఖ్య 207కు చేరుకుంది. అందులో చేవెళ్ల డివిజన్‌లో అత్యధికంగా 81, ఇబ్రహీంపట్నంలో 31, షాద్‌నగర్‌లో 23 కేసులు నమోదయ్యాయి. ఆమనగల్లులో 10 కడ్తాల్‌లో 6, తలకొండపల్లిలో 2, శంషాబాద్ ఆర్‌జీఐఏ పరిధిలో 17, శంషాబాద్‌లో 20, మహేశ్వరంలో 13, కందుకూరులో 4 కేసులు నమోదయ్యాయి. అలాగే వివిధ కారణాలతో గతేడాది 59 మంది ఆత్మహత్య చేసుకోగా, ఈసారి ఈ సంఖ్య 344కు చేరుకుంది. అత్యధికంగా ఇబ్రహీంపట్నంలో పరిధిలో 113 మంది, చేవెళ్లలో 74, షాద్‌నగర్‌లో 47, శంషాబాద్‌లోని రెండు పీఎస్ పరిధిల్లో 51, మహేశ్వరంలో 10, కందుకూరులో 12, కడ్తాల్‌లో 14, తలకొండపల్లిలో 16, ఆమనగల్లులో 7 కేసులు నమోదయ్యాయి.
మిస్టరీగా మిస్సింగ్స్..
మిస్సింగ్ కేసులు పెరిగి పోతున్నాయి. చాలావరకు ఈ కేసులు మిస్టరీగానే మారుతున్నాయి. 2024లో 771 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. గత ఏడాది 852 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, ఈ సారి ఆ సంఖ్య పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. జిల్లాలో 771 మిస్సింగ్ కేసులు నమోదు కాగా అత్యధికంగా ఇబ్రహీంపట్నం పరిధిలోనే 217, చేవెళ్ల డివిజన్ పరిధిలో 194 కేసులు నమోదయ్యాయి. అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో 126 కేసులు, కడ్తాల్ పరిధిలో 28, తలకొండపల్లి పరిధిలో 14, ఆమనగల్లులో 19, షాద్‌నగర్‌లో 42, మహేశ్వరంలో 38, శంషాబాద్ పీఎస్ పరిధిలో 70 కేసులు నమోదయ్యాయి.
రంగారెడ్డి రూరల్ నియోజకవర్గాల పరిధిలో కేసుల వివరాలు
నేరం 2021 2022 2023 2024
హత్యలు 48 14 29 36
అత్యాచారాలు 124 73 112 116
ఆత్మహత్యలు 426 373 59 344
లైంగిక వేధింపులు 100 203 125 207
దోపిడీలు 36 18 179 35
దొంగతనాలు 617 395 390 1,055
కిడ్నాప్‌లు 82 59 95 95
రోడ్డు ప్రమాదాలు 996 971 997 1,394
మృతులు 340 260 354 430
మిస్సింగ్స్ 724 631 582 771
ఇతర కేసులు 4,065 3,606 3,788 5,506
మొత్తం 7,558 6,603 6,710 9,989