వాడుతున్న పత్తి మొలకలు
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:30 AM
మండలంలో 16 రోజులుగా వర్షాలు కురియ లేదు. అంతకు ముందు కురిసిన వర్షాలకు గ్రామాల్లో 1,500 ఎకరాల్లో పత్తి విత్తారు.

యాచారం, జూన్ 16 : మండలంలో 16 రోజులుగా వర్షాలు కురియ లేదు. అంతకు ముందు కురిసిన వర్షాలకు గ్రామాల్లో 1,500 ఎకరాల్లో పత్తి విత్తారు. అయితే వానల్లేక రైతుల ఆశలపై నీళ్లు చల్లే విధంగా పరిస్థితి తయారైంది. భూమిలో తేమ లేక పత్తి మొలకలు వాడుతున్నాయి. చౌదర్‌పల్లి, మేడిపల్లి, నానక్‌నగర్, తమ్మలోనిగూడ, కొత్తపల్లి, తక్కళ్లపల్లి గ్రామాల్లో పత్తి విస్తారంగా సాగు చేశారు. అయితే వానల్లేక పత్తి విత్తనాలు భూమిలోనే ఉండి పోయాయి. మొలిచిన మొలకలూ వాడుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో వర్షాలు పడకుంటే మొలకలు కూడా ఎండిపోతాయని, విత్తులు బుడ్డిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఐదెకరాల్లో పత్తి పెడితే రూ.20వేల ఖర్చయింది : బర్ల మల్లేష్, రైతు, నానక్‌నగర్
నేను ఐదు ఎకరాల్లో పత్తి వేశాను. ఇప్పటికి రూ.20వేలు ఖర్చుచేశాను. 16 రోజులుగా వర్షాలు పడలేదు. అకడక్కడ మొలకలు మొలిచాయి. కొన్ని చోట్ల విత్తనాలు ఇంకా భూమిలోనే ఉన్నాయి. అవి బడ్డిపోయి మొలకెత్తుతాయనే నమ్మకం లేదు. మొలకలూ వాడిపోతున్నాయి. మమ్మల్ని ఆ వానదేవుడే ఆదుకోవాలి.