రూ.10 కోట్ల వ్యయం.. దాతల సాయం!
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:11 AM
దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. కళాశాల నిర్మాణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి కళాశాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

శరవేగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవన నిర్మాణం
దాతల ఉదారత.. స్వచ్ఛందంగా విరాళాలు అందజేత
షాద్‌నగర్, డిసెంబరు 30(ఆధ్రజ్యోతి) దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. కళాశాల నిర్మాణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి కళాశాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సుమారు 2వేల గజాల్లో మూడంతస్థుల్లో భవన నిర్మాణం జరుగుతోంది. దాదాపు రూ.10 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఈమేరకు దాతలు పెద్దఎత్తున విరాళాలు అందజేసేందుకు ముందుకొస్తున్నారు.
52 ఏళ్లుగా మరమ్మతులకు నోచని కళాశాల
షాద్‌నగర్ పట్టణంలో 1970వ దశకంలో ప్రభుత్వ కళాశాల నిర్మాణం జరిగింది. ఆ తర్వాత కాలేజీలో కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదు. దాంతో కళాశాల పూర్తిగా శిథిలమైంది. ఆరు నెలల క్రితం కళాశాల శిథిలావస్థ గురించి ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కళాశాలను సందర్శించి శిథిలావస్థలో ఉన్న కాలేజీని పరిశీలించి కొత్త జూనియర్ కళాశాల నిర్మాణం చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. దానికి తోడు కనీస సౌకర్యాలు కల్పించాలని సంకల్పించారు. అందుకు పూర్వ విద్యార్థులందరినీ ఒక వేదికపై తెచ్చి కళాశాల ధీనస్థితిని వివరిస్తూ నూతన కాలేజీ నిర్మాణం కోసం విరాళాలు అందజేయాలని కోరారు. ఈ ఏడాది సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవం రోజున భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదేరోజున పలువురు ప్రముఖులు రూ.20లక్షల విరాళాలు అందజేశారు. పనులు ప్రారంభమవగానే కొత్తూరు మండలానికి చెందిన యుగంధర్‌రెడ్డి రూ.25లక్షలు, హైదరాబాద్‌కు చెందిన మరో వ్యాపారి రూ.25లక్షలు విరాళాలు ప్రకటించారు. వీరితో పాటు ప్రముఖ వ్యాపారులు, నాయకులు, మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి, మాజీ జడ్పీటీసీ శాం్యసుందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత కాశీనాథ్‌రెడ్డి, పూర్వ విద్యార్థి దండు వాసుతో పాటు మరికొందరు రూ.5లక్షల చొప్పున విరాళాలు అందజేశారు. వారు రోజుల క్రితం బీఆర్‌ఎస్ నేత నందారం అశోక్‌గౌడ్ రూ.15లక్షలు, మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు లక్ష చొప్పున విరాలాలు అందజేశారు. దాంతో దాతల సహకారంతో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల పనులు ఊపందుకున్నాయి. దాతలు స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తుండటంతో వచ్చే విద్యా సంవత్సరం వరకు కళాశాల అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
దాతల సహకారంతో నిర్మాణం హర్షణీయం
ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించడం హర్షణీయం. దీనివల్ల ఇంటర్ విద్యావ్యవస్థ బాగుపడుతుంది. కార్పొరేట్ తరహాలో నిర్మిస్తుండటంతో విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు వెళ్లరు. విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.5లక్షలు విరాళం అందజేశా. దాతలు ముందుకు రావల్సిన అవసరం ఉంది.
- దండు వాసు, వ్యాపారవేత్త
విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత
ఒక ఎమ్మెల్యేగా, సాధారణ పౌరుడిగా తాను విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను. ఇందులో భాగంగానే తాను విద్యనభ్యసించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు కాలేజీ శిథిలావస్థకు చేరింది. నూతన భవనాన్ని భావితరాలు గుర్తుంచుకునేలా నిర్మించాలని నిర్ణయించుకున్నా. కేవలం దాతల సహకారంతో నిర్మిస్తాం. చాలామంది విరాళాలు అందించడం హర్షణీయం.
- వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే