నాడు వినియోగం.. నేడు విస్మరణ
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:05 AM
చెత్తను కేవలం వ్యర్థమని భావిస్తే పొరపాటే. చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసి పంట పొలాలకు ఎరువులుగా మార్చుకోవచ్చు.
డంపింగ్ యార్డులో పేరుకుపోతున్న చెత్త
తాండూరులో రోజూ 50మెట్రిక్ టన్నుల సేకరణ
గతంలో ఈ ప్రాంతంలో పార్కు
తాండూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): చెత్తను కేవలం వ్యర్థమని భావిస్తే పొరపాటే. చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసి పంట పొలాలకు ఎరువులుగా మార్చుకోవచ్చు. గతంలో తాండూరు మున్సిపల్ కమిషనర్‌లుగా రమణాచారీ, బోగేశ్వర్లు పని చేసిన సమయంలో వినూత్నంగా సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చి సత్ఫలితాలను పొందారు. మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన రమణాచారి హయాంలో చెత్త డంపింగ్‌యార్డు వద్ద గ్రీనర్ పార్కు ఏర్పాటు చేయడంతో పాటు అప్పటి మున్సిపల్ పాలకవర్గాన్ని, మీడియాను మున్సిపల్ అధికారులను తీసుకెళ్లి వన భోజనాలు చేయించారు. తర్వాత 2009లో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన బోగేశ్వర్లు హయాంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2019 పోటీలో భాగంగా చెత్తసేకరణ నూతన విధానాన్ని అవలంభించారు. మున్సిపల్‌లో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో అడ్డగోలుగా వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా డంపింగ్ చేస్తూ సేంద్రియ ఎరువును తయారు చేశారు. ఎందుకూ పనికిరాదనుకున్న చెత్తను భూసారం పెంచే విధంగా అప్పటి అధికారులు చర్యలు చేపట్టి విజయం సాధించారు. చెత్తాను సేకరించేందుకు అప్పట్లో 8 ట్రాక్టర్లు, 4 ఆటోలు, 12 తోపుడు బండ్లు, 6 రిక్షాలతో ప్రతీరోజు 40 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించేవారు. తాండూరు మండలం అంతారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెకరాల స్థలంలో చెత్తను డంపింగ్ చేసేవారు. డంపింగ్‌యార్డు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. డంపింగ్ యార్డులో కూరగాయల సాగు నిర్వహణ కూడా చేపట్టేవారు. డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువులను తయారు చేసేందుకు సిండ్రో కంపోస్టు కేంద్రాన్ని ఏర్పాటుచేసి సేకరించిన యార్డుల్లో ప్రత్యేక గిడ్డంగులనూ ఏర్పాటు చేసి 20రోజుల వరకు చెత్తను ఆరబెట్టి తర్వాత జల్లెడ పట్టి ఎరువుగా మార్చేవారు. తయారు చేసిన సేంద్రియ ఎరువులను క్వింటాల్ రూ.800 నుంచి రూ.1000ల చొప్పున విక్రయించేవారు. ప్రస్తుతం డంపింగ్ యార్డులో చెత్తనిల్వలు పేరుకుపోయాయి. అప్పట్లో చెత్తను కంపోస్టు చేయడానికి వినియోగించిన యంత్రాలు ప్రస్తుతం కనిపించకుండా పోయాయి. చెత్తను కంపోస్టు ఎరువుగా తయారు చేసి వాటి విక్రయాల ద్వారా మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకోవాలని శ్రద్ధచూపడం లేదు. వర్మీ కంపోస్టును తయారు చేయాలని నిర్ణయించినప్పటికీ ముందుకు సాగడంలేదు.
బల్దియాలో చెత్తను వినియోగించుకోవడం లేదు: ఆసిఫ్, కౌన్సిలర్
తాండూరు బల్దియాలో అవినితిపైనే ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇతర అభివృద్ది పనులపై, డంపింగ్ యార్డులో చెత్తను సద్వినియోగం చేసుకోవడంలేదు. ప్రసుత్తం మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న విక్రమ్ సింహారెడ్డికి గతంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అయినప్పటికీ ఆయనకు చెత్తపై చిత్తశుద్ధిలేదు. తాండూరులో సమర్థవంతంగా క్లిన్ అండ్ గ్రీన్ చేస్తున్నాడని భజన చేస్తున్నవారు తన వార్డుకు వస్తే అవినీతి ఏమేరకు జరుగుతుందో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా.
వర్మీ కంపోస్టు తయారీకి నిర్ణయించాం: వెంకటయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్
డంపింగ్ యార్డులో తడి చెత్త ఆధారంగా వర్మీ కంపోస్టు తయారు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించిన పరికరాలు సమకూర్చిన వెంటనే చెత్తను వర్మీ కంపోస్టుగా తయారు చేసి విక్రయిస్తాం. డంపింగ్ యార్డులో చెత్తను దశల వారీగా తొలగింపజేస్తాం. నాకు డంపింగ్ యార్డు ప్రక్షాళనకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే డంపింగ్ యార్డు రూపురేఖలు మార్చేస్తా.