Share News

నత్తనడకన పాఠశాల భవన నిర్మాణ పనులు

ABN , Publish Date - May 27 , 2024 | 12:06 AM

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి గత ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకాన్ని తీసుకొచ్చింది.

నత్తనడకన పాఠశాల భవన నిర్మాణ పనులు
పిల్లర్లకే పరిమితమైన పాఠశాల తరగతి గదులు

88లక్షలలో గత సంవత్సరం ప్రారంభమైన పనులు

ఈ విద్యాసంవత్సరానికైన అందుబాటులోకి వచ్చేనా..!

కేశంపేట, మే 26: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి గత ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, అధికారుల పర్యవేక్షణ లోపమో.. నిధుల కొరతనో గానీ, గతేడాది మార్చిలో ప్రారంభించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మండల పరిధిలోని సంగెం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధి పనులకు గత సంవత్సరం మార్చి 24న శంకుస్థాపన చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి మన ఊరు- మన బడి, జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.88లక్షల నిధులు కేటాయించింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మాత్రం పనులను గాలికి వదిలేశాడు. దాదాపు 14 నెలలు గడుస్తున్నా తరగతి గదుల నిర్మాణ పనులు పిల్లర్ల వరకే పూర్తయ్యాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాల నిర్మాణ పనులు వేగంగా చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి

గత సంవత్సరం ప్రారంభించిన పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి. పాత భవనాన్ని కూల్చివేసి.. కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టారు. దాంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టిసారించి వెంటనే పనులు పూర్తచేసేలా చర్యలు తీసుకోవాలి.

- చౌడం శ్రీనివాస్‌, సంగెం గ్రామం

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో నిలిచిన పనులు

మను ఊరు- మన బడి పథకం పనులు టెండర్‌ ద్వారా పిలువబడ్డాయి. సంగెం పాఠశాల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు చేయడంలో నిర్లక్ష్యం వహించాడు. ప్రభుత్వం మారడంతో పనులు ముందుకు సాగడంలేదు. సమస్యను కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాం.

- మనోహర్‌, ఇన్‌చార్జి ఎంఈవో, కేశంపేట

Updated Date - May 27 , 2024 | 12:06 AM