Share News

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల ఆధునికీకరణకు సీఎం ఆదేశం

ABN , Publish Date - May 30 , 2024 | 12:22 AM

రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఆధునికీకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించడంతో జిల్లాలోని పలు కార్యాలయాల రూపు రేఖలు మారనున్నాయి.

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల ఆధునికీకరణకు సీఎం ఆదేశం
అద్దె భవనంలో కొనసాగుతున్న మేడ్చల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

మారనున్న కార్యాలయాల రూపు రేఖలు

మేడ్చల్‌ జెడ్పీ కార్యాలయంలోకి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం తరలింపు?

మేడ్చల్‌ మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఆధునికీకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించడంతో జిల్లాలోని పలు కార్యాలయాల రూపు రేఖలు మారనున్నాయి. అధిక ఆదాయం లభించే కార్యాలయాలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం ఆదేశించడంతో నగర శివారుల్లోని జిల్లా కార్యాలయాల్లో ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యలు తీరనున్నాయి. కార్పొరేట్‌ స్థాయిలో భవనాలు, అందులో వెయిటింగ్‌ హాళ్లు వంటి సౌకర్యాలను కల్పించనున్నారు. జిల్లాలో 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుండగా వాటిల్లో నాలుగు మాత్రమే ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా 8 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోనే అధిక ఆదాయం లభించే ఈ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి సమస్యలు పేరుకున్నా పట్టించుకునే నాథుడు లేడు. అద్దె భవనాల్లోని కార్యాలయాల్లో వసతుల్లేవు. మేడ్చల్‌ వంటి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోకి వృద్దులు, వికలాంగులు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి ఉంది. మరుగుదొడ్లు, తాగునీటి వంటి వసతులు కూడా లేవు. రిజిస్ట్రేషన్లకు వచ్చే ప్రజలు గంటల తరబడి నిలబడి పడిగాపులు కాయాల్సిందే. ఒక్కోసారి గంటల తరబడి సర్వర్‌ పనిచేయకపోతే ఇక అంతే సంగతులు. ఆ రోజు రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చే వారు చుక్కలు చూడాల్సిందే. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను కార్పోరేట్‌ స్థాయిలో ఆధునీకరించాలని ఆదేశాలు ఇవ్వడంతో సమస్యలు తీరనున్నాయి. జిల్లాలో 12 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలుండగా వల్లభనగర్‌, ఘట్‌కేసర్‌, కీసర, మల్కాజిగిరి కార్యాలయాలు మాత్రమే ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. శామీర్‌పేట ఆఫీసుకు భవన నిర్మాణం పూర్తయినా ఎన్నికల కోడ్‌తో ప్రారంభించలేదు. ఉప్పల్‌ కార్యాలయానికి స్థలం కేటాయించినా నిర్మాణం పూర్తికాలేదు. ఇక్కడే ఉప్పల్‌, నారాపల్లి రెండు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఒకే భవనంలో ఉండేలా అధికారులు పరిశీలిస్తున్నారు. కూకట్‌పల్లి, బాలానగర్‌, కాప్రా, కుత్బుల్లాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్థలం కేటాయించలేదు. తాజాగా సీఎం ఆదేశాలతో అధికారులు స్థల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆదాయం సమకూర్చే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది.

జడ్పీ కార్యాలయంలోకి మేడ్చల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తరలింపు?

కాగా మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయంలోకి మేడ్చల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని తరలించే యోచనలో అధికారులున్నారు. జిల్లాల సంఖ్య తగ్గించే క్రమంలో కేవలం ఐదు మండలాలతో కొనసాగుతున్న మేడ్చల్‌ జిల్లాను రద్దుచేసే యోచనలోనూ ప్రభుత్వం ఉండటంతో ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా పరిషత్‌ పాలకవర్గం మరో మూడు నెలల్లో ముగియనుంది. దీనితో ఆ ప్రభుత్వ భవనం ఖాళీగా ఉంటుందని, ఆ భవనాన్ని మేడ్చల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి కేటాయించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

Updated Date - May 30 , 2024 | 12:22 AM