Share News

చేవెళ్ల మేధావుల్లారా.. ఆలోచించి ఓటెయ్యండి

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:15 AM

చేవెళ్ల మేధావుల్లారా.. ఒక్కసారి ఆలోచించి ఓటేయ్యండని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సూచించారు.

చేవెళ్ల మేధావుల్లారా.. ఆలోచించి ఓటెయ్యండి
ప్రజలకు విజయ సంకేతం చూపుతున్న కేసీఆర్‌.. బహిరంగ సభకు తరలివచ్చిన జనం

బీసీలకు దమ్ముంటే కాసానిని గెలిపించండి

షాబాద్‌ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశాం

రంజిత్‌రెడ్డి ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా.!

రియల్‌ ఎస్టేట్‌ ఎందుకు పడిపోయింది?

ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

రంగారెడ్డి అర్బన్‌/చేవెళ్ల/మొయినాబాద్‌/షాబాద్‌ : చేవెళ్ల మేధావుల్లారా.. ఒక్కసారి ఆలోచించి ఓటేయ్యండని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సూచించారు. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్‌ అన్నారు. కాసాని జడ్పీ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాకు సేవలందించారని, పాలనపై పట్టు, అనుభవం ఉన్న వ్యక్తి అన్నారు. బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకు వచ్చారని, బీసీలకు దమ్ముంటే కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపు బీసీలకు మలుపు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. షాబాద్‌ మండలం చందనవెల్లిలో వెల్పన్‌, కుందన్‌, కటేరా, అమేజాన్‌, సీతారాంపురంలో ఎలక్ర్టానిక్‌ బస్సులు, శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు వంటి పెద్దపెద్ద కంపెనీలను తీసుకువచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఉద్దండాపూర్‌ నుంచి చేవెళ్ల వరకు సాగు, తాగునీటి పనులకు కొనసాగించామని, వాటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకుందని ఆయన ఆరోపించారు. వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో బోరుబావుల కింద వరి పంట అధికంగా సాగు చేశారని, ధాన్యం అధికంగా వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో వేయడం జరిగిందని చెప్పారు. బీజేపీ సర్కార్‌ రంగారెడ్డి జిల్లాకు మెడికల్‌ కళాశాలలు, నవోదయ కళాశాలలు ఇవ్వకపోయినప్పటికి.. తమ ప్రభుత్వం రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు వేర్వేరుగా మెడికల్‌ కాలేజీలను ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.

రంజిత్‌రెడ్డి ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా..!

రంజిత్‌రెడ్డికి ఏం తక్కువ చేశాం.. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది.. నేను చెబితేనే మీరు ఓట్లేసి గెలిపించారు.. ఆయనేమి పొద్దుతిరుగుడు పువ్వా...? అధికారం ఎక్కుడ ఉంటే.. అక్కడ తిరగటానికి అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. రంజిత్‌రెడ్డి ఏ కారణం చేత కాంగ్రె్‌సలోకి వెళ్లాడు... అధికారం కోసమా? వ్యాపారం కోసమా అని ఆయన ప్రశ్నించారు. రంజిత్‌రెడ్డికి చేవెళ్ల గడ్డ ప్రజలు దీటైన దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చాక ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో భూములు ధరలు అమాంతంగా పెరిగాయని, లక్షల మందికి యువతకు ఉపాధి లభించిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రియల్‌ ఎస్టేట్‌ సర్వనాశనం అయిందని ఽవిమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఎమ్మెల్యేలు ఆరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు సురభివాణీ దేవి, ఎగ్గె మల్లేశం, దయానందగుప్తా, శంభీపూర్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్వర్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, రసమయి బాలకిషన్‌, టీఎ్‌సఐఐసీ మాజీ చైర్మన్‌ బాలమల్లు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, పార్టీ నేతలు కాసాని వీరేష్‌, కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.

చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగరవేస్తాం: సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగరవేస్తామని మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత చేవెళ్ల ప్రజపైనే ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలంతా లోక్‌సభ ఎన్నికల్లో జోష్‌తో పనిచేయాలని సూచించారు.

ఒక్కసారి అవకాశమివ్వండి : ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌

ఉమ్మడి జిల్లా ప్రజలకు నేను ఎన్నో సేవలు అందించాను. ఉమ్మడి రాష్ట్రంలో 93 బీసీ కులాలలను ఏక తాటిపైకి తీసుకు వచ్చానని, తనకు ఎంపీగా ఒక్కసారి అవకాశమిచ్చి ఆశీర్వదించాలని అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. ఉమ్మడి జిల్లాలో జడ్పీ చెర్మన్‌గా, ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉందన్నారు.

రాష్ట్రానికి దశ దిశ చూపించిన నేత కేసీఆర్‌ : కాలె యాదయ్య

రాష్ర్టానికి దశదిశ చూపించిన నేత కేసీఆర్‌ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి రైతులు, పేదలు, అన్నివర్గాల ప్రజలకు చేయూతనిచ్చారని కొనియాడారు. చేవెళ్ల నియోజకర్గంలోని ఈసీ, మూసీ నదులపై 10 బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు అందించినట్లు చెప్పారు. 84 గ్రామా లకు గుదిబండగా ఉన్న జీవో 111 ఎత్తేయడం జరిగిందన్నారు.

ఉమ్మడి జల్లాకు దరిద్రం వదిలింది : పైలట్‌ రోహిత్‌రెడ్డి

పట్నం కుంటుంబం బీఆర్‌ఎస్‌ పార్టీ వీడటంతో ఉమ్మడి రంగారెడ్డికి దరిద్రం వదిలిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల సీటు ఆశపడ్డ వారికి మల్కాజిగిరి సీటు దక్కిందని, అక్కడ నుంచి అటే ఇంటికే పోతారని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థి కొండా’ను గెలిపిస్తే.. చిక్కడు దొరకడని, ఆయనే ఎవరినే గుర్తుపట్టడని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిన వాళ్లే ఇటు కాంగ్రెస్‌ అటు బీజేపీలకు అభ్యర్థులుగా ఉన్నారని, ఒక్క లీడర్‌ పోతే వంద మంది లీడర్లను తయారు చేసే సత్తా కేసీఆర్‌కు ఉందన్నారు. శంకర్‌పల్లి ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, చేవెళ్ల మాజీఎంపీపీ బాల్‌రాజ్‌, జడ్పీటీసీలు అవినా్‌షరెడ్డి, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

స్టెప్పులేసిన ఎమ్మెల్యే ‘కాలె’

ప్రజాగాయకుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సభలో తన ఆట, పాటలతో సభికులను హోరిత్తించారు. ‘గులాబీల జెండలమ్మ’ అనే పాటకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్టెప్పులేశారు. మాజీ మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌ పార్టీ కండువాలను ఊపితూ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు.

ప్రజా ఆశీర్వాద సభ సస్సెస్‌

చేవెళ్లలో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్‌ హాజరైన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈసభకు చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి భారీగా జనాలు తరలివచ్చారు. సభలో కేసీఆర్‌ మాటల తూటాలతో ఇటు ఓటర్లలో అటు బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపారు. కేసీఆర్‌ ప్రసంగం మధ్యంలో ఈలలు, చప్పట్లు, కేరింతలు, జైతెలంగాణ.. జైజై తెలంగాణ అంటూ నినాదాలతో సభా ప్రాంగణంలో హోరెత్తింది. కాంగ్రెస్‌ప్రభుత్వంతో పాటు బీజేపీ వైఫల్యాలను ఆయన ప్రజలకు వివరించారు.

Updated Date - Apr 14 , 2024 | 12:52 AM