Share News

లోకాయుక్త ఆదేశాలతో తహసీల్దార్‌పై కేసు

ABN , Publish Date - Jun 29 , 2024 | 11:55 PM

గతంలో శంకర్‌పల్లి తహసీల్దార్‌గా పనిచేసిన మోహన్‌రావుపై కేసు నమోదైంది.

లోకాయుక్త ఆదేశాలతో తహసీల్దార్‌పై కేసు

శంకర్‌పల్లి, జూన్‌ 29: గతంలో శంకర్‌పల్లి తహసీల్దార్‌గా పనిచేసిన మోహన్‌రావుపై కేసు నమోదైంది. లోకాయుక్త ఆదేశాల మేరకు శనివారం శంకర్‌పల్లి పోలీసులు తహసీల్దార్‌తో పాటు అప్పటి దొంతాన్‌పల్లి వీఆర్‌వో, జంగంపేట మాణిక్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బాలాపూర్‌ మండలం మల్లాపూర్‌ గ్రామానికి చెందిన కడారి అంజయ్య.. 2021లో శంకర్‌పల్లి మండలం పిల్లిగుండ్లకి చెందిన దర్ని శ్రీకాంత్‌, దర్ని రాములమ్మల వద్ద దొంతాన్‌పల్ల్లిలో సర్వే నంబర్‌ 151లో 0.22గుంటల భూమి జీపీఏ చేసుకున్నాడు. 2005-06లో తహసీల్దార్‌గా పనిచేసిన మోహన్‌రావు, దొంతాన్‌పల్లి వీఆర్‌వో పిల్లిగుండ్లకు చెందిన జంగంపేట మాణిక్‌రెడ్డి పేరిట అదే 0.22గుంటల భూమిని 24 సెప్టెంబరు 2005న మ్యుటేషన్‌ చేశారు. అక్రమంగా మ్యుటేషన్‌పై కడారి అంజయ్య లోకాయక్తను ఆశ్రయించాడు. లోకాయుక్త ఆదేశాల మేరకు పోలీసులు తహసీల్దార్‌, వీఆర్‌వో, మాణిక్‌రెడ్డిలపై 420, 465, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై శంకర్‌పల్లి సీఐ హబీబుల్లాఖాన్‌ను వివరణ కోరగా.. అప్పటి తహసీల్దార్‌, వీఆర్‌వో, మాణిక్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

Updated Date - Jun 29 , 2024 | 11:55 PM