అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:16 AM
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రెండు రోజుల క్రితం ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో నగరంలోని వెస్ట్ వెంకటాపురంలో నివాసం ఉండే రవీందర్, లక్ష్మి దంపతులు, వారి పెద్ద కుమారుడు, కోడలు మృతిచెందగా ఇదే ఘటనలో కారు డ్రైవర్ సైతం మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు అలియాబాద్ వాసులు
వధూవరులు సహా ఐదుగురు దుర్మరణం
మృతుల్లో నవ దంపతులు, వరుడి తల్లిదండ్రులు
స్వగ్రామంలో అంత్యక్రియలు
మూడుచింతలపల్లి, మార్చి 7: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రెండు రోజుల క్రితం ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో నగరంలోని వెస్ట్ వెంకటాపురంలో నివాసం ఉండే రవీందర్, లక్ష్మి దంపతులు, వారి పెద్ద కుమారుడు, కోడలు మృతిచెందగా ఇదే ఘటనలో కారు డ్రైవర్ సైతం మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నవ దంపతులు, వరుడి తల్లిదండ్రులు మృతిచెందగా గురువారం స్వగ్రామం అలియాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. వివాహం జరిగి వారం గడవక ముందే వధూవరులు సహా ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ హృదయ విదారక ఘటన వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని అల్వాల్ వెస్ట్ వెంకటపురంలో నివాసముంటున్న రవీందర్(55)కు భార్య లక్ష్మి(49), ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బాలకిరణ్(30) స్వీడన్‌లో ఉద్యోగం చేసేవాడు. అతడికి పెళ్లి నిశ్చయం కావడంతో ఫిబ్రవరి 8న స్వదేశానికి వచ్చాడు. అతడికి ఏపీలోని తెనాలికి చెందిన కావ్యశ్రీ(28)తో మార్చి 1న వధువు స్వస్థలంలో పెళ్లి జరిగింది. ఈ నెల 3న శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపాలిటీ పరిధి సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్‌లో రిసెప్షన్ నిర్వహించారు. మరుసటి రోజు సోమవారం బాలకిరణ్, కావ్యశ్రీ, రవీందర్, లక్ష్మి కలిసి వేంకటేశ్వరస్వామి దర్శనానికి కారులో తిరుమల వెళ్లారు. దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు బుధవారం తెల్లవారు జామున నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అశోక్(22)తో పాటు ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడిక్కకడే మృత్యువాత పడ్డారు. నలుగురి మృతదేహాలను శామీర్‌పేట మండలంలోని సొంత ఊరు అలియాబాద్‌కు తరలించారు. గురువారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అలియాబాద్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురు కుటుంబీకుల మృతితో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగింది.