Share News

భారీగా చేపల కొనుగోళ్లు

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:49 PM

మృగశిర కార్తె కావడంతో శనివారం చేపల కొనుగోళ్లు, అమ్మకాలు భారీగా పెరిగాయి.

భారీగా చేపల కొనుగోళ్లు
ఇబ్రహీంపట్నంలో జోరుగా చేపల విక్రయాలు

ఇబ్రహీంపట్నం, జూన్‌ 8: మృగశిర కార్తె కావడంతో శనివారం చేపల కొనుగోళ్లు, అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇబ్రహీంపట్నం మార్కెట్లో చేపల ధర ఒక్కసానిగా పెరిగింది. కొర్రమీను సాధారణ రోజుల్లో కిలో రూ.500 ఉండగా మృగశిర రోజు కిలోకు వంద పెంచి రూ.600కు అమ్మారు. అలాగే రవ్వ, బొచ్చ సాధారణంగా రూ.200 కిలో ఉంటే రూ.250-300కు అమ్మారు. బంగారు తీగ, జెల్ల రూ.200కు అమ్మారు. ఇబ్రహీంపట్నం చెరువులో శనివారం తెల్లవారుజాము నుంచే ప్రజలు చేపల కోసం బారులు తీరారు.

షాద్‌నగర్‌ అర్బన్‌: మృగశిర కార్తె సందర్భంగా పట్టణంలో చేపల రేట్లు పెంచారు. రోజూ విక్రయించే ధర కంటే కిలోకు 50 వరకు ఎక్కువ తీసుకున్నారు. షాద్‌నగర్‌లో చేపల లభ్యత లేక హైదరాబాద్‌ రాంనగర్‌ మార్కెట్‌ నుంచి తెచ్చి విక్రయిస్తున్నారు. అయితే మృగశిర శనివారం రావడంతో గిరాకీ పెద్దగా రాలేదని వ్యాపారులు తెలిపారు.

కందుకూరు: కందుకూరు, కొత్తగూడ, ముచ్చర్ల, తిమ్మాపురం గ్రామాల చెరువుల వద్ద చేపలను కొన్నారు. చెరువుల వద్దకు ప్రజలు బారులు తీరగా వారికి టోకెన్‌లు ఇచ్చి లైన్‌లో వచ్చిన వారికి చేపలు అమ్మారు.

యాచారం: మాల్‌, మేడిపల్లి గ్రామాల మత్స్యకారులు నాగార్జునసాగర్‌ నుంచి చేపలు తెచ్చి గ్రామాల్లో విక్రయించారు. చింతపట్ల, నానక్‌నగర్‌ చెరువుల వద్ద చేపల విక్రయాలు సాగాయి. కిలో కొర్రమట్ట రూ.850కి అమ్మారు. చెరువుల వద్దకు జనం వెళ్లినా మధ్యాహ్నం 2గంటల కల్లా చేపలు అయిపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.

చేవెళ్ల: మండలంలో చేపల కోసం జనం ఎగబడ్డారు. చే వెళ్ల, శంకర్‌పల్లి, మోయినాబాద్‌, షాబాద్‌ మండలాల్లో భారీగా చేపల అమ్మకాలు జరిగాయి. కిలోకు వంద పెంచారు. బొచ్చె రూ.300, రవ్వు 300, కొర్రమీను 800కు అమ్మారు. మత్స్యకారులు గండిపేట, హిమయత్‌నగర్‌ జలాశయాల నుంచి చేపలు తెచ్చి అమ్మారు.

శంకర్‌పల్లి: గండిపేట, ఖానాపూర్‌లోని చెరువు, సంగారెడ్డిల నుంచి చేపలు తెచ్చి అమ్మారు. మృగశిర కార్తె శనివారం రావడంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని చేపల అమ్మకందారులు తెలిపారు.

శంషాబాద్‌: శంషాబాద్‌లో శనివారం మృగశిరను సంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. మధురానగర్‌, ఆర్బీనగర్‌, సిద్ధాంతి, కొత్వాల్‌గూడచౌరస్తా, అంబేడ్కర్‌ చౌరస్తా, ఎయిర్‌ పోర్టుచౌరస్తా, అంగడిబజార్‌ ప్రాంతాల్లో చేపలు అమ్మారు.

మొయినాబాద్‌ రూరల్‌ : గ్రామాల్లోని ప్రజలు భారీగా చేపలు కొనుగోలు చేసి వండుకొని ఆరగించారు. అజీజ్‌నగర్‌, చిలుకూరు గ్రామాలకు వచ్చి చేపలు కొన్నారు. హి మాయత్‌సాగర్‌ చెరువు చేపలకు మక్కువ చూపారు. 10 నుంచి 15కిలోల చేపలు వలలో చిక్కినట్లు మత్య్సకారులు తెలిపారు. మృగకార్తె సందర్భంగా ముదిరాజు, వడ్డెర కులస్తులు చెరువుల వద్ద పూజలు నిర్వహించారు. చేపల విక్రయానికి మార్కెట్‌ యార్డును ఏర్పాటు చేయాలని మత్స్యకార సంఘం నాయకుడు శ్రీరాములు కోరారు.

Updated Date - Jun 08 , 2024 | 11:49 PM