Share News

గోదాంలు నిర్మించరేం?

ABN , Publish Date - May 20 , 2024 | 12:06 AM

రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు వ్యవసాయ శాఖ గోదాంల నిర్మాణం చేపట్టకపోవడంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

గోదాంలు నిర్మించరేం?
యాచారంలో ప్రైవేట్‌ భవన వద్ద కొనుగోలు కేంద్రం

స్థలం ఉన్నా గోడౌన్ల ఏర్పాటుపై నిర్లక్ష్యం

అన్నదాతల పరిస్థితిని పట్టించుకోని అధికారులు

ఏటా కేంద్రాల వద్ద ధాన్యం తడిసి నష్టపోతున్న రైతులు

యాచారం, మే 19 : రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు వ్యవసాయ శాఖ గోదాంల నిర్మాణం చేపట్టకపోవడంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో మండల కేంద్రంలో గోదాం నిర్మాణం చేస్తామని అధికారులు ప్రకటించారు. నెల రోజుల పాటు స్థల సేకరణ కోసం ఆరా తీశారు. తీరా గోదాం నిర్మాణాన్ని మాత్రం అటకెక్కించారు. యాచారంలోని వెంచర్లలో పంచాయతీకి కేటాయించిన 10శాతం స్థలంలో గోదాంలకు అనువైన స్థలమున్నా నిర్మించలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్థలం చూపకే గోదాం నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించి నిధులు వెచ్చించలేని పరిస్థితి నెలకొందని రైతులు పేర్కొంటున్నారు. గున్గల్‌, యాచారం, తక్కళ్లపల్లి, నందివనపర్తి గ్రామాల్లోని వెంచర్లలో గోదాంల నిర్మాణానికి స్థలం ఉన్నా కట్టించడం లేదు. ఆయా స్థలాల్లో పల్లెప్రకృతి వనాలు పెంచుతున్నారని రైతులు వాపోతున్నారు. మండల కేంద్రంలో ఓ ప్రైవేట్‌ భవనం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నడుపుతున్నారు. వర్షం వస్తే ధాన్యం తడసి రైతులు నష్టపోతున్నారు. తేమ 17శాతానికి తగ్గే వరకు ఎండబోసి ధాన్యం విక్రయిస్తారు. అయితే అదే సమయంలో వర్షం వస్తే నిల్వ చేసుకునేందుకు స్థలం లేకుండాపోయింది. ఎండబోసిన చోటే కుప్ప చేసి తాటిపత్రిలు కప్పినా ఫలితం లేకుండా పోతోంది. కొనుగోలు కేంద్రం వద్ద గోదాం ఉంటే వానొచ్చే సమయంలో ధాన్యాన్ని అందులో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి సదుపాయం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం కుప్పలు నానుతున్నాయి. మాల్‌, తమ్మలోనిగూడ, యాచారం, గున్గల్‌, నందివనపర్తిల్లోని వెంచర్లలో పంచాయతీకి కేటాయించిన భూమిలో గోదాంలు నిర్మిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మండల కేంద్రం లేదా ఏదేని గ్రామాల్లో రెండు గోదాంల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గోదాం నిర్మించి మమ్మల్ని ఆదుకోండి : మహిపాల్‌రెడ్డి, రైతు, నానక్‌నగర్‌

యాచారంలో ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు గోదాం నిర్మించాలి. మేం అమ్మేందుకు తెచ్చిన ధాన్యం ఆరుబయటే పోస్తున్నాం. వర్షం వస్తే నిల్వ చేసేందుకు ఎలాంటి షెల్టర్‌ లేదు. ప్రతీ ఎండకాలం ధాన్యం తడుస్తోంది. ఆ వడ్లను కొనుగోలు కేంద్రంలో కూడా తీసుకోరు. గోదాం ఉంటే అందులో నిల్వ చేసుకుంటాం. యాచారంలో ఉన్న రైతు భవన్‌ ఆవరణలో ధాన్యం నిల్వకు షెడ్డు కట్టిస్తే బాగుంటుంది. వ్యవసాయ గోదాంల నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకోవాలి.

రైతులకు సరిపడా గోదాంలను ఏర్పాటు చేయాలి : ఎ.నర్సింహ, సీపీఎం మండల కార్యదర్శి

మండల కేంద్రంతో పాటు ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు పండించే గ్రామాల్లో గోదాంలు నిర్మించాలి. యాచారం, చింతపట్ల, మాల్‌, గున్‌గల్‌ గ్రామాల్లో గల వెంచర్లలో గోదాంల నిర్మాణానికి సరిపడా స్థలం ఉంది. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి. కలెక్టర్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాంల నిర్మాణానికి నిధులు విడుదల చెయ్యాలి.

Updated Date - May 20 , 2024 | 12:06 AM