Share News

మొగిలిగిద్ద మండలం ఏర్పాటుపై... చిగురిస్తున్న ఆశలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:58 PM

కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై పునఃసమీక్షిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ టీవీ డిబేట్‌లో చెప్పడంతో ఫరూఖ్‌నగర్‌ మండలంలోని మొగిలిగిద్ద గ్రామస్తుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

మొగిలిగిద్ద మండలం ఏర్పాటుపై... చిగురిస్తున్న ఆశలు
వందేళ్ల క్రితం ఏర్పాటు చేసిన పోలీ్‌సస్టేషన్‌లో కొనసాగుతున్న లైబ్రరీ

కొత్త ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్న స్థానికులు

షాద్‌నగర్‌ రూరల్‌, జనవరి 14 : కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై పునఃసమీక్షిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ టీవీ డిబేట్‌లో చెప్పడంతో ఫరూఖ్‌నగర్‌ మండలంలోని మొగిలిగిద్ద గ్రామస్తుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వందేళ్ల క్రితమే చరిత్రపుటల్లో ఉన్న మొగిలిగిద్ద గ్రామాన్ని మండలంగా ఏర్పాటుచేసేందుకు అన్ని అర్హతలున్నాయని వారంటున్నారు.

నిజాం కాలంలోనే పోలీ్‌సస్టేషన్‌, పోస్టాఫీసుల ఏర్పాటు

స్వాతంత్ర్యానికి ముందే ఈ గ్రామంలో పోలీ్‌సస్టేషన్‌, పోస్టాఫీసు, పాఠశాలను నాటి పాలకులు ఏర్పాటు చేశారు. నవాబులపై తిరుగుబాటు చేసిన తుర్రేబాజ్‌ఖాన్‌ను చంపాలని నవాబులు పథకం పన్నారు. అతడు బెంగళూరు వెళ్లే క్రమంలో మార్గ మధ్యలో మొగిలిగిద్దలో ఆశ్రయంపొందాడని సమాచారం అందుకున్న నవాబులు తుర్రేబాజ్‌ఖాన్‌ను పట్టుకెళ్లి చంపినట్లు చెప్పుకుంటారు. మొగిలిగిద్దలో తమ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని తెలుసుకున్న నిజాం సర్కార్‌ మొగిలిగిద్దలో పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేసింది. అక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పోస్టాఫీసును నెలకొల్పారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించాలనే నిజాం పాలకులు అప్పట్లోనే ఇక్కడ స్కూలును పెట్టారు.

మండల వ్యవస్థ ఏర్పాటుతో వెనకబడ్డ గ్రామం

తెలుగుదేశం ప్రభుత్వం 1985లో రాష్ట్రంలో మండల వ్యవస్థను ఏర్పాటు చేసింది. 1985లో కొందుర్గు మండలాన్ని చేసి మొగిలిగిద్దలో ఉన్న పోలీ్‌సస్టేషన్‌ను రాత్రికి రాత్రే కొందుర్గుకు తరలించారు. పోస్టాఫీసు, పాఠశాల ఇప్పటికీ కొనసాగుతుండగా పాత పోలీ్‌సస్టేషన్‌ భవనంలో మాత్రం తుర్రేబాజ్‌ఖాన్‌ పేరుతో మినీ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. అయితే లైబ్రరీకి ప్రభుత్వ సహకారం లేక మూతపడింది. కాగా ఆ భవనం నేటికీ చెక్కుచెదరలేదు. ఇటీవల శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి ఈ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు ఆయనను పాత పోలీ్‌సస్టేషన్‌ భవనం వద్దకు తీసుకెళ్లి చూపించారు. ఇక్కడ కనీసం పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌నైనా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల ఆకాంక్షను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.

నియోజకవర్గంలో రెండు కొత్త మండలాలు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసింది. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కొత్తూరును విభజించి నందిగామ మండలాన్ని, అలాగే కొందుర్గు మండలం నుంచి చౌదరిగూడ మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండు పాత మండలాల కంటే విస్తీర్ణం, జనాభా పరంగా పెద్ద మండలం ఫరూఖ్‌నగర్‌. ఈ మండలంలో 47 గ్రామ పంచాయతీలున్నాయి. దీనిని విభజించి మొగిలిగిద్దను కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మండల సాధన డిమాండ్‌తో వంద రోజుల దీక్షలు

గత ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసే సందర్భంలో చారిత్రికత కలిగిన తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వంద రోజులు రిలే నిరాహార దీక్ష చేశారు. మొగిలిగిద్ద పాఠశాలలోనే హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉత్తరప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ సత్యనారాయణరెడ్డి, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వంటి వారు చదువుకున్నారు. ఇక్కడ చదివిన మరెందరో డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. గత ప్రభుత్వాలు తమ గ్రామానికి గుర్తింపు ఇవ్వలేదని స్థానికులు అసంతృప్తిగా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇర్విన్‌ను మండలం చేశారని, ఇప్పటికైనా తమ గ్రామాన్ని మండలం చేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మండలంగా చేస్తుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు.

దీక్షలు చేసినా పట్టించుకోలేదు : సిరాజుద్దీన్‌, మొగిలిగిద్ద

మొగిలిగిద్దను మండలం చేయాలని వంద రోజుల పాటు దీక్షలు చేసినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. మండలం చేసేందుకు తమ గ్రామంలో అన్ని సౌకర్యాలు, అర్హతలూ ఉన్నాయి. మా గ్రామం కంటే చిన్న గ్రామాలను మండలాలుగా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా మొగిలిగిద్దను మండలంగా ఏర్పాటు చేయాలి.

పాలన సౌలభ్యం కలుగుతుంది : కక్కునూరి వెంకటే్‌షగుప్తా, మొగిలిగిద్ద

మొగిలిగిద్దలో పోలీ్‌సస్టేషన్‌ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. చరిత్ర కలిగిన మా గ్రామాన్ని మండలం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొత్త మండలాల సమీక్ష సమయంలో మా గ్రామంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి.

Updated Date - Jan 14 , 2024 | 11:58 PM