ధీర‘నారీమణులు’..
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:21 AM
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఉపాధి కోసం వేలాది కిలోమీటర్లు వలస వచ్చి.. పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు కార్మికులు విగతజీవులుగా మారారు. ప్రమాదాల్లో జీవిత భాగస్వామిని కోల్పోయిన మహిళలు తిరిగి తమ స్వరాష్ట్రాలకు వెళ్లకుండా మొక్కవోని ధైర్యంతో ఇక్కడే ఉంటూ.. కార్మికులుగా మారి కుటుంబాలను పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

భర్త చనిపోయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు
కుటుంబాలను పోషిస్తూ పలువురికి ఆదర్శం
20 ఏళ్ల కింద వలస వచ్చి ఇక్కడే జీవనం
వలస కార్మికుల విషాదగాథ..
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఉపాధి కోసం వేలాది కిలోమీటర్లు వలస వచ్చి.. పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు కార్మికులు విగతజీవులుగా మారారు. ప్రమాదాల్లో జీవిత భాగస్వామిని కోల్పోయిన మహిళలు తిరిగి తమ స్వరాష్ట్రాలకు వెళ్లకుండా మొక్కవోని ధైర్యంతో ఇక్కడే ఉంటూ.. కార్మికులుగా మారి కుటుంబాలను పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కొత్తూర్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతో 1976లో అప్పటి ప్రభుత్వం కొత్తూర్ వద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేసింది. దాంతో ఆ ప్రాంతంలో వందలాది పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు కొత్తూర్‌కు వలస వచ్చి ఆయా పరిశ్రమల్లో ఉపాధి పొందుతూ అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
మృత్యు వాతపడుతున్న కార్మికులు
కొత్తూర్ పారిశ్రామిక వాడ ఏర్పడినప్పటి నుంచి పలు పరిశ్రమల్లో అనేక ప్రమాదాలు సంభవించాయి. 2020లో బిహార్‌కు చెందిన రాంగణిత్ యాదవ్(40) ఆనంద్ స్టీల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. మహాలక్ష్మీ టెక్స్‌టైల్ పరిశ్రమలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన మితిలే్‌షకుమార్(42) ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఇలా అనేకమంది పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి మృత్యువాత పడ్డ సంఘటనలు కోకోల్లలు. ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల మృతదేహాలను స్థోమత ఉన్న కుటుంబసభ్యులు వారి వారి ప్రాంతాలకు తరలించి అక్కడ అంత్యక్రియలు చేసుకోగా, స్థోమత లేని వారు ఇక్కడే అంత్యక్రియలు జరిపించుకున్నారు. మృతి చెందిన పలువురు కార్మికుల భార్యలు తమ రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉంటుండగా, కొందరు వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక్కడే ఉన్న కార్మికుల కుటుంబాలు ఆయా పరిశ్రమల్లో మళ్లీ కార్మికులుగా చేరి పిల్లలను పోషిస్తూ ఇక్కడే నివాసం ఉంటున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిస్తున్నారు. గత 20 ఏళ్లుగా పిల్లలను పోషిస్తూ కటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఔరా అనిపిస్తున్నారు.
నామమాత్రపు నష్టపరిహారం
పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించి మృత్యువాత పడుతున్న కార్మికుల కుటుంబాలకు పరిశ్రమల యాజమానులు నామమాత్రపు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దాంతో కార్మికుల కుటుంబాలు చేసేది లేక చాలిచాలనీ జీతాలతో జీవితాలు గుడుపుతుంటారు. 20 ఏళ్ల క్రితం కొత్తూర్‌కు వలస వచ్చిన కార్మికులు ఇక్కడి ప్రజలతో పూర్తిగా కలిసిపోయారు. తెలుగు భాషా నేర్చుకుని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. తెలుగు సంస్కృతి పండుగల్లోనూ పాలుపంచుకుంటున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
20 సంవత్సరాల క్రితం కొత్తూర్‌కు వలస వచ్చాం. నాభర్త రాంగణిత్ యాదవ్ పరిశ్రమ ప్రమాదంలో మృ తి చెందాడు. అప్పటినుంచి కుటుంబ భారాన్ని నేనే మోస్తున్నాను. బిస్కట్ పరిశ్రమలో దినసరి కార్మికురాలి గా పనిచేస్తూ అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నా ను. తక్కువ వేతనం వస్తుంది. నాకు ముగ్గురు కుమార్తెలు. వారిని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాను. పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు. తన భర్తకు సంబంధించి నామమాత్రం నష్ట పరిహారం అందింది. ఇక్కడ ప్రజలు తమను ఎంతో అదారిస్తున్నారు. ప్రభుత్వం మాలాంటి వారిని ఆదుకోవాలి.
- పింకాదేవి, భర్తను కోల్పోయిన మహిళ
20 ఏళ్లుగా ఇక్కడే జీవనం
20 సంవత్సరాల క్రితం కొత్తూర్‌కు వలస వచ్చాం. మదనపల్లి వద్ద గల మహాలక్ష్మీ టెక్స్‌టైల్ పరిశ్రమల్లో నా భర్త మితిలే్‌షకుమార్(42) కార్మికునిగా పనిచేశాడు. ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. మాకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ముగ్గురు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. తన భర్త తండ్రి శ్యామ్‌బిహారిసా కూడ ఇక్కడే ఉంటున్నాడు. 5 మంది కుటుంబ సభ్యులను నేనే పోషిస్తున్నాను. చాలిచాలనీ వేతనంతో బిస్కట్ పరిశ్రమల్లో కార్మికురాలిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రజలు తమను ఎంతో మంచిగా చూసుకుంటున్నారు. మేము కొత్తూర్‌లోనే ఉండిపోతాం. ప్రభుత్వం మా కుటుంబాన్ని అదుకోవాలి.
- రేనాకుమారి, భర్తను కోల్పొయిన భార్య