Share News

ఘనంగా వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:12 AM

షాద్‌నగర్‌ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

ఘనంగా వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
షాద్‌నగర్‌ అర్బన్‌ : పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, తదితరులు

మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

షాద్‌నగర్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 18: షాద్‌నగర్‌ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరుడికి పంచామృత అభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మృత్స్యంగ్రహణం, అంకురారోపణం, హోమం, ధ్వజాపటాదివాసం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. పట్టణ ప్రముఖులు డాక్టర్‌ విజయ్‌కుమార్‌, డాక్టర్‌ శారద, పలబట్ల బాల్‌రాజ్‌ గుపా, పరిగి వెంకటసాయిశ్వర్‌రెడ్డి, ఒగ్గు కిషోర్‌, కమ్మదనం సుధాకర్‌, కానుగు రాం భూపాల్‌, నర్సింహులు గుప్తా తదితరులు భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

మైసిగండిలో ముగిసిన శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు

కడ్తాల్‌ : రాష్ట్రస్థాయిలో ఖ్యాతిగాంచి నిత్యపూజలు, భక్తుల సందడితో భాసిల్లుతున్న కడ్తాల మండలం మైసిగండి రామాలయంలో శ్రీకోదండ రామచంద్రస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి. మూడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌ తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలలో భాగంగా గురువారం పూర్ణాహుతి, పల్లకీ సేవ, చక్రతీర్థం, పుష్కర స్నానం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పల్లకీలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. పూర్ణాహుతితో ఆలయ ఫౌండర్‌ట్రస్టీ సిరోళిపంతూ బ్రహ్మోత్సవాలను ముగించారు. ఈవో స్నేహలత, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, ఉత్సవ కమిటీ నిర్వాహకుడు రామావత్‌ భాస్కర్‌, మాజీ సర్పంచ్‌లు రామావత్‌ తులసీరామ్‌ నాయక్‌, శేఖర్‌గౌడ్‌, తహసీల్దార్‌ ఆర్పీ జ్యోతి, నాయకులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

వార్షికోత్సవాలకు ఆలయాల ముస్తాబు

కడ్తాల్‌ : మండల కేంద్రంలోని శ్రీ విజయ గణపతి, శ్రీదేవి భూదేవీసమేత ప్రసన్న వేంకటేశ్వర స్వామి, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఆలయాలు వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. ద్వితీయ వార్షికోత్సవాల నేపథ్యంలో దేవాలయాలను పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈనెల 20 నుంచి 22 వరకు కొనసాగే బ్రహ్మోత్సవాల కోసం నిర్వాహకులు భక్తులకు విశాల వసతులు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల వివరాలను ఆలయ ధర్మకర్త పోకల బస్వరాజ్‌ రాజమణి దంపతులు వివరించారు. ఈనెల 20 ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకం, సాయంత్రం 6 గంటలకు గోపూజ, ఆలయ ప్రవేశం,మహగణపతి విశ్వక్‌సేన ఆరాధన, గౌరీ పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, 21న ధ్వజారోహణం, మంత్రపుష్పం, అర్చనలు, కుంకుమార్చన, 22న ఉదయం 11:45 నిమిషాలకు సీతారాముల కల్యాణం, మహాబలిహరణం, పూర్ణాహుతి, కుంభాభిషేకం కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.

Updated Date - Apr 19 , 2024 | 12:12 AM