చౌడమ్మగుట్టపై బ్లాస్టింగ్‌లు ఆపాలి : పీవీఆర్
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:48 PM
షాద్‌నగర్ మున్సిపాలిటీలోని చౌడమ్మగుట్టపై కొనసాగిస్తున్న పేలుళ్లకు ఇళ్లు కంపిస్తున్నాయని శ్రీ బాలాజీ టౌన్‌షిప్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
షాద్‌నగర్ అర్బన్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): షాద్‌నగర్ మున్సిపాలిటీలోని చౌడమ్మగుట్టపై కొనసాగిస్తున్న పేలుళ్లకు ఇళ్లు కంపిస్తున్నాయని శ్రీ బాలాజీ టౌన్‌షిప్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు టౌన్‌షిప్ నివాసి అయిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలో ఆదివారం సాయంత్రం కాలనీవాసులు చౌడమ్మగుట్టపైకి వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చి, ఆందోళన చేపట్టారు. అక్కడకు వచ్చిన ఎస్సై బాల్‌రాంకు పేలుళ్ల తీవ్రత గురించి వివరించారు. రియల్టర్లు గోరంత అనుమతులు పొంది కొండంత పేల్చివేతలు చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రియల్టర్లు పాత జాతీయ రహదారి పక్కన ఉన్న గుట్టను పేల్చి అక్కడున్న వేంకటేశ్వరస్వామి ఆల యాన్ని నామరూపాలు లేకుండా చేశారన్నారు. ఇప్పుడు చౌడమ్మ దేవాలయం లేకుండా చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీకి ఫోన్ చేసి సమస్యను వివరించారు. పర్యావరణానికి, ప్రజలకు ఇబ్బంది కల్గించే విధంగా చేపడుతున్న పేలుళ్లపై విచారణ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.