Share News

భానుడి భగభగ.. కోళ్లు మృత్యువాత

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:45 PM

బ్రాయిలర్‌ కోళ్ల పెంపకందారులు వేసవి కాలంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెట్టుబడికి చేసిన అప్పులతో సమతమతమవుతుండగా.. మరిన్ని అప్పుల చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. భానుడు భగభగలతో ఇప్పటికే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

భానుడి భగభగ.. కోళ్లు మృత్యువాత

ఎండవేడిమి తట్టుకోలేక చనిపోతున్న వైనం

కష్టంగా మారిన కోళ్లఫారాల నిర్వహణ

చాలాచోట్ల వాటర్‌ ట్యాంకర్‌తో నీటి సరఫరా

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు

యాచారం, ఏప్రిల్‌ 25: బ్రాయిలర్‌ కోళ్ల పెంపకందారులు వేసవి కాలంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెట్టుబడికి చేసిన అప్పులతో సమతమతమవుతుండగా.. మరిన్ని అప్పుల చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. భానుడు భగభగలతో ఇప్పటికే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా మూగజీవాలు తట్టుకోలేకపోతున్నాయి. బాయిలర్‌ కోళ్లఫారాలతో జీవనోపాధి పొందుతున్న చిన్న, సన్నకారు రైతులు అష్టకష్టాలపాలవుతున్నారు. ఎండవేడిమి తట్టుకోలేక కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. సొసైటీలు, వాణిజ్య బ్యాంకుల్లో భూములను, బంగారు నగలను తాకట్టు పెట్టి రైతులు అప్పులు చేసి, బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం చేపట్టారు. ఇంటెగ్రేటెడ్‌ చికెన్‌ కంపెనీల నిర్వాహకులు కోడి పిల్లలతో పాటు దాణా కూడా సరఫరా చేస్తుంటారు. ఒక్కొక్కటి రూ.4.50లకు సరఫరా చేస్తుండగా.. పదివేల కోళ్లను పెంచితే రైతుకు 45 రోజుల పాటు పెంచినందుకు గాను, కంపెనీ రూ.65వేల నుంచి లక్ష వరకు చెల్లిస్తుంది. అయితే, విద్యుత్‌ బిల్లు నెలకు రూ.7నుంచి రూ.8వేల వరకు వస్తుందని, కోడిపిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే ఇంజక్షన్‌ రెండుసార్లు వేస్తే కనీసం రూ.10 వేల వ్యయమవుతుందని తెలిపారు. కోళ్లఫారాల్లో పనిచేసే వారికి (దంపతులకు) నెలకు రూ.25 వేల వేతనం ఇవ్వగా.. ఒక్కో బ్యాచ్‌కు ఖర్చులు పోను చేతికందేది కేవలం రూ.20 నుంచి 35 వేలు మాత్రమేనని రైతులు వాపోతున్నారు. చాలాచోట్ల బోర్లు ఎండిపోవడంతో వాటర్‌ ట్యాంకర్‌కు రూ.1000 నుంచి రూ.1200లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని, రెండు రోజులకోసారి నీరు తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, మొత్తం మీద ఎండాకాలంలో నీటి కోసం అదనంగా రూ.22వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు.

ఎండ తీవ్రతతో చనిపోతున్న కోళ్లు

గత 45 రోజులుగా భానుడు భగభగమంటున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో షెడ్లలో వేడి అధికమై విక్రయానికి సిద్ధమైన కోళ్లు చనిపోతున్నాయి. దాంతో చికెన్‌ కంపెనీ సూపర్‌వైజర్‌ వచ్చి పరిశీలించే వరకూ వాటిని షెడ్డులోనే ఉంచాలి. ఈక్రమంలో దుర్వాసన భరించలేక మరిన్ని కోళ్లు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల్లో 680 బ్రాయిలర్‌ కోళ్లను పెంచే షెడ్లు (ఫారాలు) ఉన్నాయి. కాగా, 15 వేల కోళ్లు పెంచుతున్న షెడ్డు నిర్వహణకు నెలకు రూ.లక్షా 60వేల వ్యయమవుతుందని, కూలీల వేతనం, విద్యుత్‌ బిల్లులు, ఇంజక్షన్లు, వరి పొట్టు ఖర్చులన్నీ పోగా.. నెలకు చిల్లిగవ్వ కూడా అందడం లేదని రైతులు వాపోతున్నారు. బ్యాంకులకు వడ్డీ చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని, కంపెనీల నిర్వాహకులు చికెన్‌ ధరలు పెంచి ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా, మూడు రోజుల క్రితం తమ్మలోనిగూడలో రైతు అయిలయ్య పెంచుతున్న దాదాపు మూడు వందల కోళ్లు(రోజుకు 150 చొప్పున) చనిపోయాయి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలలో తీరని నష్టం

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తీరని నష్టం వాటిల్లుతోంది. ఎండ వేడిమికి విక్రయానికి సిద్ధంగా ఉన్న కోళ్లు చనిపోతుండడంతో ఏమీ చేయలేకపోతున్నాం. చికెన్‌ కంపెనీలు చొరవ తీసుకొని ధరలు పెంచి ఆదుకోవాలి. బాయిలర్‌ కోళ్లఫారం నిర్వాహణ కష్టంగా మారింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.

- బందె రాజశేఖర్‌రెడ్డి, రైతు, కుర్మిద్ద

Updated Date - Apr 26 , 2024 | 08:51 AM