Share News

బాలుడిని సిమ్మింగ్‌పూల్‌లో ముంచి హత్యాయత్నం

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:11 AM

బాలున్ని స్విమ్మింగ్‌ పూల్‌లో ముంచి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సైదులు తెలిపారు.

బాలుడిని సిమ్మింగ్‌పూల్‌లో ముంచి హత్యాయత్నం

  • ఇద్దరిపై కేసు నమోదు

  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 6: బాలున్ని స్విమ్మింగ్‌ పూల్‌లో ముంచి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సైదులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్‌కు చెందిన ఓ కుటుంబం ఇటీవల ఘట్‌కేసర్‌కు వలస వచ్చి కూలి పనులు చేసుకుంటున్నారు. వారి కుమారుడు(బాలుడు) పాఠశాలకు సెలవు ఉన్నప్పుడల్లా స్థానిక ఫ్లవర్‌షాప్‌లో పనిచేసేవాడు. అయితే బాలుడు గత ఫిబ్రవరి నుంచి షాపులో పనికి వెళ్లలేదు. దీంతో షాప్‌ యజమాని రఫీక్‌, అతడి స్నేహితుడు ఇంతియాజ్‌లు కలిసి బాలున్ని తీసుకొని కొండాపూర్‌లోని సిమ్మింగ్‌పూల్‌కు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్‌ చేస్తుండగా బాలున్ని రఫీక్‌, ఇంతియాజ్‌లు నీళ్లలో ముంచుతూ ఊపిరి ఆడకుండా చేశారు. అంతటితో ఆగకుండా ఇంతియాజ్‌ బాలుడి గొంతుకు తాడుచుట్టి నీళ్లలో ముంచాడు. సిమ్మింగ్‌పూల్‌లో బాలుడిపై చేస్తున్న సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి పైశాచిక ఆనందాన్ని పొందారు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలున్ని బెదిరించారు. గతంలో వారు సెల్‌ఫోన్‌లో తీసిన సన్నివేశాలను శనివారం సాయంత్రం బాలుడి తల్లికి పంపారు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 07 , 2024 | 12:11 AM