అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:14 AM
జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరిగ్గా పౌష్టికాహారం పంపిణీపై దృష్టిసారించాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు.

సమీక్ష సమావేశంలో కలెక్టర్ గౌతమ్
మేడ్చల్ జనవరి 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరిగ్గా పౌష్టికాహారం పంపిణీపై దృష్టిసారించాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో చేపడుతున్న కార్యక్రమాలు, డే కేర్ సెంటర్ల నిర్వహణ, సెక్టార్ల వారీగా వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో స్టాక్ వివరాలు, బాలామృతం ఏ విధంగా అందజేస్తున్నారు? తదితర అంశాలపై కలెక్టర్ అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, సంక్షేమాధికారి కృష్ణారెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అధికారులు పాల్గొన్నారు.