Share News

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు నాణ్యతగా చేయాలి

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:54 PM

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేస్తున్న పనులు నాణ్యతగా చేయాలని, నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు నాణ్యతగా చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌

మేడ్చల్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి) : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేస్తున్న పనులు నాణ్యతగా చేయాలని, నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. పాఠశాలల్లో చేపడుతున్న పనులను అధికారులు రోజూ పర్యవేక్షిస్తూ వేగవంతంగా పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, స్కూల్‌ యూనిఫాం తయారీ తదితరాంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలల్లో వసతులు కల్పనలో భాగంగా 286 స్కూల్లలో చేపట్టిన తాగునీరు, మరుగుదొడ్లు, మరమ్మతులు, మరుగుదొడ్లు, విద్యుత్‌ వంటి పనులు ఇప్పటి వరకు ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని పనులు చేయాల్సి ఉంది, ఎప్పటిలోగా పూర్తిచేస్తారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యాచరణ రూపొందించుకొని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని సూచించారు. పనులను నాణ్యతగా చేయించాల్సిన బాధ్యత స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీపై ఉందన్నారు. నిధులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫామ్‌లను పాఠశాలల పునఃప్రారంభానికి ముందే పాఠశాలలకు చేర్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. యూనిఫాంలు స్వయం సహాయ సంఘాలు కుడుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్ని జతలు సిద్ధం చేశారు? మెటీరియల్‌ అందుబాటులో ఉందా? అని వివరాలు అడిగారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అభిషేక్‌అగస్త్య, డీఆర్డీవో పీడీ సాంబశివరావు, డీఈవో విజయకుమారి, మెప్మా అధికారి అనిల్‌కుమార్‌, ఎగ్జిక్యుటివ్‌ ఇంజనీర్లు, ఏఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:54 PM