Share News

పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:03 PM

ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరిగేలా రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ శశాంక విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు.

పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ
రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శశాంక

పోలింగ్‌ కేంద్రాల్లో 20, 21 తేదీల్లో స్పెషల్‌క్యాంపెయిన్‌

18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలి

పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ కె. శశాంక

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 18 : ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరిగేలా రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ శశాంక విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో భాగంగా ఈ నెల 6న ఓటర్‌ డ్రాఫ్ట్‌ జాబితా ప్రచురితమైందన్నారు. దానిలో క్లైమ్స్‌, అభ్యంతరాలకు ఈ నెల 22 వరకు అవకాశముందని తెలిపారు. డూప్లికేట్‌, చనిపోయిన వారి పేర్లు తొలగించాలని, అర్హులను ఓటరు జాబితాలో నమోదు చేయించాలని, అదేవిధంగా మార్పులు, చేర్పులకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వీటిపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు బూత్‌ స్థాయిలో ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్‌ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ఇంకా ఎక్కడైనా కొత్త పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంటే తెలపాలని సూచించారు. ముఖ్యంగా 1,450 పైచిలుకు ఓటర్లు కలిగిన చోట కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రతిపాదించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గం వారీగా ప్రతీవారం పొలిటికల్‌ పార్టీల మీటింగ్‌లు నిర్వహించి అన్ని విషయాలను తెలియజేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. ఈనెల 20, 21 తేదీలలో అన్ని పోలింగ్‌ కేంద్రాలలో స్పెషల్‌ క్యాంపెయిన్‌ డేస్‌గా నిర్వహిస్తున్నామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఓటరు జాబితాతో బీఎల్వోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు నమోదు చేసుకునే విధంగా స్సష్టమైన ఓటరు జాబితా రూపొందించేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:03 PM