బడిఈడు పిల్లలంతా బడిలో ఉండాలి
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:00 AM
బడిఈడు పిల్లలంతా బడిలో ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.

బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక
రంగారెడ్డి అర్బన్/ శంషాబాద్ రూరల్, జూన్ 6 : బడిఈడు పిల్లలంతా బడిలో ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి బాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడమే ప్రభుత్వం ఉద్దేశవన్నారు. బడి బయట పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్య అనేది ప్రాథమిక హక్కు అన్నారు. అంగన్‌వాడి బడిలో చదువుతున్న ఐదేళ్లు పైబడిన పిల్లలందరనీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అంగన్‌వాడి టీచర్లు కృషి చేయాలన్నారు. చదువు లేని వారు కుటుంబానికి, సమాజానికి ఎంత భారమో తెలియచేసి బడులలో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మహనీయులంతా ప్రభుత్వ బడుల్లో చదువున్న వారేనని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ బడులలో ఉన్నత చదువులు చదివి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని కలెక్టర్ తెలిపారు. అనంతరం పదో తరగతిలో 9.7 సాధించిన నర్కుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కార్తీక వీణ, అనుష్కలను కలెక్టర్ శశాంక సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈవో సుశీందర్‌రావు, శంషాబాద్ తహసీల్దార్ నాగమణి, ఎంపీడీఓ మున్నీ, సీడీపీఓ షబానా, ఎంఈ ఓ రాంరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
స్కూల్ యూనిఫాంలను సకాలంలో అందించాలి
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు త్వరగా యూనిఫామ్స్ అందజేయాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. యూనిఫామ్ పంపిణీపై సంబంధిత అధికారులతో ఆయన గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల కొలతలకు అనుగుణంగా నాణ్యతతో యూనిఫామ్‌లు కుట్టేలా పర్యవేక్షణ జరపాలన్నారు. నిర్దిష్ట గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు. యూనిఫామ్స్ తయారీ పూర్తయిన వెంటనే ప్రధానోపాధ్యాయులకు అందించాలన్నారు. ఇప్పటి వరకు 49 శాతం మేరకు యూనిఫామ్స్ సిద్ధం చేశారని కలెక్టర్ చెప్పారు. ప్రతి రోజూ సగటున ఎన్ని యూనిఫామ్స్ తయారు చేస్తున్నారనే తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 10వ తేదిలోపు యూనిఫామ్స్ ఆయా బడులకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, డీఈవో సుశీందర్‌రావు, జిల్లా మెప్మా అధికారి మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.