Share News

అన్ని ప్రాంతాలకూ సమ ప్రాధాన్యం

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:59 PM

కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

అన్ని ప్రాంతాలకూ సమ ప్రాధాన్యం
జూపల్లిలో పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు, జనవరి 28: కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వివక్షకు తావులేకుండా అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని మండలాల్లో ఆదివారం ఎమ్మెల్యే పర్యటించార ు. జూపల్లి, గోకారం, చంద్రాయన్‌పల్లి, శేరిఅప్పారెడ్డి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను జడ్పీ వైస్‌చైర్మన్‌ బాలాజీ సింగ్‌తో కలిసి ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో స్థానికులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలడిగి తెలుసుకొని.. పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గ్రామాలు, తండాలలో ప్రజల అవసరాల కనుగుణంనగా మౌళిక వసతులు కల్పించి, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. అభివృద్ధి విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. భవనాలు లేని అన్ని గ్రామ పంచాయతీలకు త్వరలో భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తుందని చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరగా సానుకూలంగా స్పందించినట్లు కసిరెడ్డి తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేసిందని, చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు చెల్లించక సర్పంచ్‌లను ఇబ్బందులను గురి చేసిందని ఆరోపించారు. వచ్చే రెండేళ్లలో కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరందిస్తామని చెప్పారు. ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:59 PM