Share News

బాల్క సుమన్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:30 PM

సీఎం రేవంత్‌ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. సుమన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బీచ్యనాయక్‌, ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడు అశోక్‌లు డిమాండ్‌ చేశారు.

బాల్క సుమన్‌పై చర్యలు తీసుకోవాలి
మాడ్గుల : బాల్క సుమన్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కడ్తాల్‌/ఆమనగల్లు, ఫిబ్రవరి 6 : సీఎం రేవంత్‌ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. సుమన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బీచ్యనాయక్‌, ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడు అశోక్‌లు డిమాండ్‌ చేశారు. మంగళవారం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి కడ్తాల సీఐ శివప్రసాద్‌కు సుమన్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్‌ యాదయ్య, నాయకులు సిద్దిగారి సురేశ్‌, వల్లభుదాసు నర్సింహ, రవి, జంగయ్య, సిరయ్య, పత్యనాయక్‌, దేవ్‌సింగ్‌ తదితరులున్నారు. రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ కోరారు. కేసీఆర్‌ బంట్రోతు అయిన సుమన్‌కు రేవంత్‌ను విమర్శించే అర్హతలేదన్నారు. ఆమనగల్లు మండల కాంగ్రెస్‌ నాయకులు సుమన్‌పై ఎస్‌ఐ బాల్‌రామ్‌నాయక్‌కు ఫిర్యాదు చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో కృష్ణనాయక్‌, ప్రసాద్‌, విజయ్‌, అలీం, సురేశ్‌ నాయక్‌, నాజర్‌ తదితరులు పాల్గొన్నారు.

బాల్క సుమన్‌ నోరు అదుపులో పెట్టుకో..

షాద్‌నగర్‌ రూరల్‌ : బాల్క సుమన్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం రేవంత్‌రెడ్డిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ నాయకులు హెచ్చరించారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తి పోతల పథకానికి సాగునీటి పేరుతో జీవో ఇచ్చింది అప్పటి సీఎం కేసీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు బూతు మాటలు నేర్పిన చరిత్ర కూడా కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని కేసీఆర్‌ ఒక్కడే తెచ్చినట్లు బాల్క సుమన్‌ దొరల గడీకి చెప్పులు మోస్తున్నాడని విమర్శించారు. దొరల గడికి ఊడిగం చేసే సుమన్‌ వాళ్ల ఎంగిలి మెతుకులకు ఆశపడి సీఎం పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిర బుద్ధి చెప్పుతామని తెలిపారు. సమావేశంలో నాయకులు రఘు, బాబర్‌ ఖాన్‌, చెంది తిరుపతి రెడ్డి, రాజు నాయక్‌, సతీష్‌, హరినాథ్‌రెడ్డి, ప్రవీణ్‌, నరేష్‌ తదితరులు ఉన్నారు.

బాల్క సుమన్‌కు మతి భ్రమించింది

కొత్తూర్‌ : సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌కు మతిభ్రమించిందని, బయట కనిపిస్తే చెప్పులతో సమాధానం చెబుతామని కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ షాద్‌నగర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కర్రొళ్ల సురేందర్‌ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్క సుమన్‌ ఎమ్మెల్యే పదవీ పోయిన తర్వాత నుంచి మతిభ్రమించి మాట్లాడుతూ పిచ్చికూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు. హద్దులు దాటిన సుమన్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రొళ్ల జగన్‌, శివ, అంజినాయక్‌, అనిల్‌, రాంజానాయక్‌, జనార్ధన్‌, జంగయ్య, రాములు, బాలునాయక్‌, రమేష్‌, రవీందర్‌, బాలరాజు, ప్రవీణ్‌, అశోక్‌, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

బాల్క సుమన్‌ క్షమాపణ చెప్పాలి

మాడ్గుల : సీఎం రేవంత్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన బాల్క సుమన్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లుగౌడ్‌ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ పెంపుడు కుక్కకు కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే అర్హత లేదని వెంకటేశ్వర్లుగౌడ్‌ హెచ్చరించారు. మాడ్గుల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సుమన్‌ దిష్టిబొమ్మను నాయకులతో కలిసి దహనం చేశారు. ఉపసర్పంచ్‌ రాములు, జింకల భాస్కర్‌, అన్నేపాక కిరణ్‌, బామండ్లపల్లి నర్సింహ, మహేష్‌, లాలయ్య, శేఖర్‌, రామచంద్రయ్య, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:30 PM