Share News

వీవోఏలను వేధిస్తున్న ఏపీఎంపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:26 AM

జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న రామస్వామి మహిళ వీవోఏలను వేధిస్తున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని గత శుక్రవారం వీవోఏ ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మైనోద్దిన్‌ సెర్ప్‌ సీఈవో అనితా రామచంద్రన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

వీవోఏలను వేధిస్తున్న ఏపీఎంపై చర్యలు తీసుకోవాలి

సెర్ప్‌ సీఈవోకు బాధితుల ఫిర్యాదు

సెర్ప్‌ సీఈవోకు ఫిర్యాదు చేస్తున్న వీవోఏలు

చౌదరిగూడ, జూన్‌ 16: జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న రామస్వామి మహిళ వీవోఏలను వేధిస్తున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని గత శుక్రవారం వీవోఏ ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మైనోద్దిన్‌ సెర్ప్‌ సీఈవో అనితా రామచంద్రన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం మాట్లాడుతూ ఏపీఎం రామస్వామి మహిళ వీవోఏలను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. గతంలో కూడా రామస్వామిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో తాము సంఘం తరఫున మందలించామని, ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రామస్వామి మహిళా వీవోఏలకు ఫోన్‌చేసి అసభ్యకర పదజాలంతో మేసేజ్‌లు పంపుతున్నారని, దీనివల్ల వారి కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదు పేర్కొన్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులు ఏపీఎం రామస్వామిని విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. కాగా, రామస్వామి మహిళా వీవోఏలకు చేసిన మెసేజ్‌లు వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుండటంతో ప్రజా సంఘాల నాయకులు, మహిళా సభ్యులు రామస్వామిని వెంటనే సస్పెండ్‌ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. కాగా, రామస్వామి ఇంతకుముందు మాడ్గుల మండలంలో ఏపీఎంగా విధులు నిర్వహించేవాడని ఆయన చెప్పారు. సీఈవోకు ఫిర్యాదు చేసిన వారిలో రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి, కోశాధికారి తిరుపతి, చంద్రశేఖర్‌, అరుణ, జానకి, మహేశ్వరి, మాఽధవి, రమ్యశ్రీ, అమృత, సుధాకర్‌, చిత్కలా, సుమిత్ర, నస్రీన్‌, అమరావతి, శిరీష తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:26 AM