హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:48 PM
ఓ మహిళ హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది.

పరిగి, జూన్ 7: ఓ మహిళ హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. ఈ కేసుకు సంబంధించి జిల్లా న్యాయాధికారి డాక్టర్ ఎస్.శ్రీనివా్‌సరెడ్డి శుక్రవారం తీర్పుఇచ్చారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డలో బొంపల్లి యాదయ్య, శానమ్మ దంపతులు నివాసముంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన బిచ్చపు రమేశ్, శానమ్మతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. 2020 ఫిబ్రవరి 27న శానమ్మ ఇంటికి తన భర్త లేని సమయంలో రమేశ్ వెళ్లాడు. అయితే రమేశ్, శానమ్మ గొడవ పడగా మాటామాటా పెరిగి రమేశ్ రాడ్‌తో శానమ్మ తలపై కొట్టి హత్యచేశాడు. అప్పట్లో విచారణ అధికారులు డీకే లక్ష్మీరెడ్డి, సీహెచ్ వెంకటేశ్వర్లు కేసు నమోదుచేపట్టి దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. కేసులో న్యాయస్థానంలో పూర్వపరాలు పరిశీలించిన న్యాయాధికారి నిందితుడికి జీవిత ఖైదీతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు పరిగి పోలీసులు తెలిపారు.