స్కూళ్లకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు
ABN , Publish Date - Aug 13 , 2024 | 11:55 PM
ఇటీవల చేపట్టిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియతో పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి.
కొరత ఉన్న చోట్ల తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకం
‘కడా’ పరిధిలోని నాలుగు మండలాల్లోనే ఎంపిక
52 పాఠశాలల్లో 54 మంది ఎంపికకు అనుమతి
బడుల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు
వికారాబాద్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఇటీవల చేపట్టిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియతో పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి అనుమతిచ్చింది. వికారాబాద్ జిల్లాలో మొదట 85 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు అవసరమవుతారని గుర్తించగా, ఇప్పటి వరకు ‘కడా’ పరిధిలోని నాలుగు మండలాల్లోని 52పాఠశాలల్లో 54మంది నియామకానికి అనుమతిస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీకాగా, గ్రామీణ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంది. కొత్తవారు జాయిన్ అయ్యే వరకు పాత వారిని రిలీవ్ చేయడం లేదు. అయితే తమను బదిలీ చోటుకు పంపాలని ఉపాధ్యాయులు విద్యాశాఖపై ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో సరిపడినంత మంది ఉపాధ్యాయుల్లేక చదువులు సాగడం లేదు. ఉపాధ్యాయుల నియామకానికి ఇటీవల డీఎస్సీ నిర్వహించగా, సెప్టెంబరు 5న గురుపూజోత్సవం రోజున నియామకపత్రాలివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటి వరకు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు చేపట్టనున్నారు. వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలోని 52 పాఠశాలల్లో 54 మందిని నియమించేందుకు అనుమతిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారికి నెలకు రూ.15,600 గౌరవ వేతనం ఇస్తారు. మూడు నెలల కాలానికే అని అపాయింట్‌మెంట్ లెటర్లలో పేర్కొన్నా డీఎస్సీ నియామకాల వరకూ కొనసాగే అవకాశం ఉంది.
‘కడా’ పరిధి పాఠశాలల్లోనే..
కొడంగల్ ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ(కడా) పరిధి బొంరా్‌సపేట్, దౌల్తాబాద్, దుద్యాల్, కొడంగల్ మండలాల్లో టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. బొంరా్‌సపేట్ మండలంలో రేగడి మైలారం, మహంతిపూర్, కొత్తూరు, లగచర్ల, ఎన్కేపల్లిల్లో 10 ఖాళీల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తారు. దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి, నీటూరు, మాటూరు, దేవరఫస్లాబాద్, దౌల్తాబా ద్, బాలంపేట్, బిచ్చ్యాల్, సుల్తాన్‌పూర్, గుమ్‌డాల్‌ల్లోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 21 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. దుద్యాల్, హకీ ంపేట్, చిల్ముల్ మైల్వార్, దుద్యాల్ ఉర్దూ మీడి యం, ఏర్పమళ్ల పాఠశాలల్లో 12 మందిని నియమిస్తారు. కొడంగల్ మండలం హస్నాబాద్ ఉర్దూ మీడి యం, అంగడి రాయిచూర్ ఉర్దూ మీడియం, అన్నారం, ఇందనూరు, టేకల్కోడ్, పర్సాపూర్, రుద్రారం, కొడంగల్, కస్తూర్‌పల్లి పాఠశాలల్లో 11 మందిని నియమించనున్నారు.
కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక
అకతడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాల్లో మొదట పాఠశాల ఉండే గ్రామ పంచాయతీ/మునిసిపల్ పరిధిలో నివాసం ఉండే అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. పంచాయతీ, మునిసిపాలిటీలో అభ్యర్థులు అందుబాటులో లేకపోతే సమీప పంచాయతీల వారికి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడా అర్హులు దొరక్కపోతే మండలంలోని గ్రామాల నుంచి దరఖాస్తు చేసుకున్న అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి విధులకు హాజరయ్యే అవకాశం ఉంది.
అర్హులు ఎవరంటే ..
స్కూల్ అసిస్టెంట్ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు డిగ్రీ, బీఎడ్ విద్యార్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవాలి. అదే తెలుగు, హిందీ, ఉర్దూ పండిత్ పోస్టులకు డిగ్రీతో పాటు పండిత్ శిక్షణ పూర్తయిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ఎంపీడీవో అధ్యక్షతన ఎంఈవో, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం, సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలతో కమిటీలు ఏర్పాటు చేస్తారు. నియామక ప్రక్రియను ఈ నెల 15వ తేదీకల్లా పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.