Share News

అవుషాపూర్‌లో దొంగల హల్‌చల్‌

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:12 AM

గుర్తుతెలియని దుండగులు పట్టపగలే రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బంగారం, వెండి అభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు.

అవుషాపూర్‌లో దొంగల హల్‌చల్‌
అవుషాపూర్‌లో దుండగులు పగులగొట్టిన ఇంటి తాళం

  • ఓ ఇంట్లో 20 తులాల బంగారం, నగదు అపహరణ

  • మరో ఇంట్లో 15గ్రాముల బంగారం, 15తులాల వెండి, నగదు చోరీ

ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని దుండగులు పట్టపగలే రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బంగారం, వెండి అభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అవుషాపూర్‌కు చెందిన కొట్టి రవీందర్‌రెడ్డి కుటుంబసభ్యులు సోమవారం స్థానిక ఓగార్డెన్‌లో జరిగిన తమ సమీప బంధువుల దావత్‌కు వెళ్లారు. రవీందర్‌రెడ్డి మధ్యాహ్నం 3గంటలకు అవుషాపూర్‌లోని తన వ్యక్తిగత కార్యాలయానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటితాళం పగులగొట్టి బీరువాలోని 20తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సాయంత్రం రవీందర్‌రెడ్డి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటితాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. దీంతో రవీందర్‌రెడ్డి ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు.

మరో ఘటనలో..

అవుషాపూర్‌ న్యూసిటీ కాలనీలో మరో ఇంట్లో దుండగులు చొరబడి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి కాలనీకి చెందిన రమావత్‌ రమేష్‌, అతడి భార్య ఇద్దరూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంటారు. వారు ఆఫీసుకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో దాచిన 15గ్రాముల బంగారం, 15తులాల వెండి ఆభరణాలతో పాటు ఆరువేల నగదును అపహరించుకెళ్లారు. రమేష్‌ ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగుల గొట్టి ఉంది. చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు క్లూస్‌టీం రప్పించి రెండు ఇళ్లలో జరిగిన చోరీలను పరిశీలించి, సీసీపుటేజీని సేకరించారు. ముగ్గురు నిందితులు బైక్‌పై వెళ్తున్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుండగులను పట్టుకుంటామని సీఐ తెలిపారు.

Updated Date - Dec 31 , 2024 | 12:12 AM