క్షుద్రపూజల కలకలం
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:13 PM
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని కోమటికుంట చెరువు క్షుద్రపూజలకు అడ్డాగా మారింది. ఇటీవల ఆ చెరువులో మునిగి ఓ విద్యార్థిని మృతి చెందింది. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి.

కోమటికుంట పరిసరాల్లో తాంత్రికపూజలు
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్
ఇటీవలే ఆ చెరువులో మునిగి విద్యార్థిని మృతి
ఆందోళనలో సమీప హాస్టళ్ల విద్యార్థులు
-మైసమ్మగూడలో ఇదే హాట్ టాపిక్
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని కోమటికుంట చెరువు క్షుద్రపూజలకు అడ్డాగా మారింది. ఇటీవల ఆ చెరువులో మునిగి ఓ విద్యార్థిని మృతి చెందింది. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో చెరువు పరిసరాల్లో దొంగ చాటుగా చేస్తున్న క్షుద్ర పూజల వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మంరింత కలకలం రేగుతోంది.
మేడ్చల్ టౌన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మైసమ్మగూడ ప్రాంతమంతా విద్యాసంస్థలకు అడ్డా.. దాంతో నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు ఆ చుట్టుపక్కల కనిపిస్తుంటారు. అర్ధరాత్రి వేళ కోమటికుంట చెరువు పరిసరాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు అక్కడి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు పరిసర ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంటుంది. దాంతో అటువైపు పగటి పూట కూడా వెళ్లడానికి విద్యార్థులు జంకుతుంటారు. అలాంటి చెరువు అంచుల్లో అఘోరీలతో క్షుద్ర పూజలు చేయిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు చెరువు వద్ద మంట పెట్టి మంత్రాలు చదువుతూ, వింత వింత చప్పుళ్లు చేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఆ పూజల సమయంలో వీడియోలను తీసి వైరల్ చేశారు. ప్రస్తుతం మైసమ్మగూడ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో కోమటికుంట వద్ద జరుగుతున్న క్షుద్ర పూజల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
గంజాయిరాయుళ్ల అడ్డా
నిర్మానుశ్యంగా ఉండే కోమటికుంట పరిసరాల్లోకి మందుబాబులు, గంజాయి రాయుళ్లు ఎక్కువగా వెళ్తుంటారని స్థానిక విద్యారుఉ్థలు చెబుతున్నారు. అటు వైపు వెళ్తే దమ్ము కొట్టాడానికో.. లేక మందు తాగడానికేనని ఇక్కడ విద్యార్థులు భావించటం పరిపాటి. కాగా, చీకటి పడితే మాత్రం చెరవు పరిసరాల్లోకి వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడని పరిస్థితి.
భయాందోళనలో హాస్టల్ విద్యార్థులు
క్షుద్రపూజలు జరుగుతున్నాయనే ప్రచారంతో మైసమ్మగూడ ప్రాంతంలోని ఈ చెరువుకు సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉండటానికి జంకుతున్నారు. రెండు మూడు రోజులకోసారి క్షుద్ర పూజలు జరగడం పరిపాటిగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ఇటీవల ఆ చెరువులో మునిగి విద్యార్థిని మృతి చెందటంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటు వైపు ఉన్న హాస్టళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం పట్ల పోలీసులు, స్థానిక విద్యా సంస్థలు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.