Share News

రైలుకింద పడి వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:59 PM

రైలుకింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

 రైలుకింద పడి వ్యక్తి మృతి

వికారాబాద్‌, ఏప్రిల్‌ 7: రైలుకింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ పట్టణం రామయ్యగూడ గ్రామానికి చెందిన మగ్గ మనోహర్‌(24) పశువులు మేపుతూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ మధ్యనే పశువులు మేపడం మానేసి కూలి పనులకు వెళ్తుండేవాడు. మద్యానికి బానిసైన మనోహర్‌ రాత్రి ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లాడు. ఉదయం 7గంటల ప్రాంతంలో మనోహర్‌ రైలుకింద పడి మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వారు అక్కడికి వెళ్లి చూసి మనోహర్‌గా గుర్తించారు. అయితే రాత్రి గుర్తుతెలియని రైలుకింద పడి మనోహర్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వికారాబాద్‌ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

నీటి సంపులో పడి చిన్నారి..

జీడిమెట్ల, ఏప్రిల్‌7 (ఆంధ్రజ్యోతి): ఇంటిముందు ఆడుకుంటున్న ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉన్న మూతలేని నీటిసంపులో పడి మృతిచెందింది. ఈ విషాద ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం రాఘాపూర్‌ గ్రామానికి చెందిన వడ్డేశివకుమార్‌, భార్య భర్తలు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి షాపూర్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరికి కుమారుడు రఘురాం, కుమార్తె అశ్వని (ఒకటిన్నర సంవత్సరాలు) ఉన్నారు. వీరితో పాటు అత్త నాగమ్మకూడా ఉంటుంది. అత్తకు పుట్టినప్పటి నుంచి మాటలు రావు, చెవులు వినిపించవు. ఆదివారం కావడంతో భార్యాభర్తలు భోజనం చేసి నిద్రపోయారు. ఈ క్రమంలో పాప ఆడుకుంటూ ఇంటిముందున్న సంపులో పడిపోయింది. కొద్దిసేపటికి అత్త నీటికోసం వెళ్లి చూడగా నీటిలో చిన్నారి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు లేచిచూసేసరికి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పాప కళ్ల ముందు విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ అంగన్‌వాడీ టీచర్‌..

తాండూరు రూరల్‌, ఏప్రిల్‌ 7: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన అంగన్‌వాడీ టీచర్‌ చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని జినుగుర్తి గ్రామానికి చెందిన గంగబాయి(36) అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. కొంతకాలం కిందట ఆమె భర్త మృతిచెందడంతో మనోవేదనకు గురైంది. ఈక్రమంలో గంగబాయి జీవితంపై విరక్తిచెంది కల్లుకు బానిసైంది. ఈనెల 1వ తేదీన గంగబాయికి కడుపునొప్పి రావడంతో భరించలేక పురుగుల మందు తాగింది. కుటుంబీకులు వెంటనే ఆమెను తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ లోని ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. గంగబాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కరన్‌కోట్‌ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 07 , 2024 | 11:59 PM