Share News

రైతు నెత్తిన విత్తన భారం

ABN , Publish Date - May 31 , 2024 | 12:06 AM

ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలతో నెలపాలై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికితోడు పెట్టుబడుల వ్యయం పెరిగి రైతులు ఆందోళన చెందుతుంటే.. ప్రస్తుతం ప్రభుత్వం పత్తి విత్తన ధరలు పెంచి రైతుల నెత్తిన విత్తన భారం మోపుతున్నాయని పలువురు రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నాయి.

రైతు నెత్తిన విత్తన భారం

పత్తి ప్యాకెట్‌కు రూ.54 పెరుగుదల

ఇతర పెట్టుబడి ఖర్చులూ అధికం

ఆందోళన చెందుతున్న రైతులు

చేవెళ్ల, మే 30: ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలతో నెలపాలై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికితోడు పెట్టుబడుల వ్యయం పెరిగి రైతులు ఆందోళన చెందుతుంటే.. ప్రస్తుతం ప్రభుత్వం పత్తి విత్తన ధరలు పెంచి రైతుల నెత్తిన విత్తన భారం మోపుతున్నాయని పలువురు రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నాయి. ఈయేడాది ఒక్కో పత్తి సీడ్‌ ప్యాకెట్‌పై రూ.54 చొప్పున ధర పెరిగింది. రూ.810 ఉన్న పత్తి విత్తన ప్యాకెట్‌ ధర ప్రస్తుతం పెరిగిన ధరతో రూ.864కు చేరింది. అన్నిరకాల కంపెనీలు బోల్‌గార్డ్‌-2 రకం పత్తి విత్తనాల ధరలు పెంచాయని ఫర్జిలైజర్‌ దుకాణదారులు చెబుతున్నారు. పత్తి విత్తన ధరలకు సంబంధించి ఏ రకం పత్తి విత్తన ప్యాకెట్‌ కొనుగోలు చేసినా ధర మాత్రం రూ.864 ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

పెరిగిపోతున్న పెట్టుబడులు

గతంతో పోలిస్తే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కూలీలకయ్యే ఖర్చు భారీగా పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ ఏడాది పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. కార్పొరేట్‌ సీడ్‌ కంపెనీలు రైతుల నుంచి పత్తి విత్తనాలను సేకరించి, గ్రేడింగ్‌ చేసి జర్మినేషన్‌ చెక్‌ చేసి ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నాయి. రైతుల నుంచి సీడ్‌ కంపెనీలు కొన్న పత్తి విత్తనాలు, సీడ్‌ ప్యాకెట్ల రూపంలో తిరిగి రైతులకు చేరేసరికి భారీగా ధర పలుకుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.730 ఉన్న పత్తి సీడ్‌ ప్యాకెట్‌ ధర ప్రస్తుతం రూ.864కు చేరింది. నాలుగు సంవత్సరాల వ్యవధిలో రూ.134 మేర ధర పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతీ సంవత్సరం సగటున సీడ్‌ కంపెనీలు ప్యాకెట్ల ధరలు పెంచుతున్నాయని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఎకరానికి దాదాపు 2ప్యాకెట్ల వరకు పత్తి విత్తనాలు అవసరం ఉంటుంది. పెట్టుబడి ఖర్చులు భరించలేనంతగా పెరుగుతుండటంతో రైతులు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీయేటా విత్తన ధరలు, క్రిమి సంహారక మందులు, యంత్రాల వినియోగ చార్జీలు, కూలీల ధరలు పెరగడంతో రైతులపై పెద్దమొత్తంలో ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వం విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలని, ధరల నియంత్రణపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

చేవెళ్ల డివిజన్‌లో పత్తి సాగు అంచనా

ఈ ఏడాది వానాకాలం సాగు ప్రణాళికను ఇప్పటికే వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈమేరకు చేవెళ్ల డివిజన్‌లో పత్తి అధికంగా సాగయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చేవెళ్ల మండలంలో 20,910 హెక్టార్లు, మొయినాబాద్‌ మండలంలో 5,036, షాబాద్‌ మండలంలో 26,465, శంకర్‌పల్లి మండలంలో 10,245 హెక్టార్లలో పత్తి సాగుచేసే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు.

ధరల పెంచడంతో కంపెనీలకే లాభం

విత్తన కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ఏటా ధరలు పెంచుతున్నారు. ప్రభుత్వం పెంచిన ధరలతో పాటు సబ్సిడీ కూడా పెంచాలి. అలా అయితేనే రైతులకు నష్టం జరగదు. పెట్టుబడులు ఇప్పటికే చాలా పెరిగిపోయాయి. రైతులపై ఆర్థిక భారం మోపొద్దు. ప్రభుత్వం పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలి.

- మల్గాని సుధాకర్‌గౌడ్‌, రాష్ట్ర రైతు సంఘం కౌన్సిల్‌ మెంబర్‌

విత్తన ధరలు తగ్గించాలి

రైతులపై ఆర్థిక భారం పడకుండా పత్తి విత్తన ధరలను తగ్గించాలి. ఇప్పటికే అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో పాటు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం విత్తన ధరలు పెంచడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విత్తన ధరలను తగ్గించి రైతులను ఆదుకోవాలి.

- సీహెచ్‌. శ్రీనివాస్‌, రైతు చేవెళ్ల

Updated Date - May 31 , 2024 | 09:48 AM