Share News

భారీ మొత్తంలో నల్లమందు స్వాధీనం

ABN , Publish Date - May 03 , 2024 | 12:24 AM

రూ.కోటీ 73లక్షల విలువచేసే నల్లమందు పౌడర్‌, నకిలీ గుట్కా ప్యాకెట్లను ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఎక్సైజ్‌ పరిధిలోని కాటేదాన్‌ బాబుల్‌రెడ్డినగర్‌లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం సాయంత్రం జరిపిన దాడుల్లో నల్లమందుతో పాటు నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

భారీ మొత్తంలో నల్లమందు స్వాధీనం

రూ.కోటీ 73లక్షల విలువచేసే నల్లమందు పౌడర్‌, నకిలీ గుట్కా ప్యాకెట్లు సీజ్‌

ఇద్దరు నిందితుల అరెస్టు.. బొలెరో వాహనం, పది సెల్‌ఫోన్లు స్వాధీనం

శంషాబాద్‌, మే 2(ఆంధ్రజ్యోతి) : రూ.కోటీ 73లక్షల విలువచేసే నల్లమందు పౌడర్‌, నకిలీ గుట్కా ప్యాకెట్లను ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఎక్సైజ్‌ పరిధిలోని కాటేదాన్‌ బాబుల్‌రెడ్డినగర్‌లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం సాయంత్రం జరిపిన దాడుల్లో నల్లమందుతో పాటు నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బాబుల్‌రెడ్డినగర్‌ బస్తీలో దలరాం అనే వ్యక్తి గోదాం ఏర్పాటు చేసుకొని కొంతకాలంగా ఈ దందా నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు దలరాంతో పాటు అజర్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొలేరో వాహనాన్ని, పది మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, వారు గోదాంలో నల్లమందు పౌడర్‌ను ఉపయోగించి గుట్కా ప్యాకెట్లు తయారు చేసేందుకు బొలేరో వాహనంలో రాజస్థాన్‌ నుంచి ముడిసరుకును తీసుకొచ్చేవారని ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. బాబుల్‌రెడ్డి నగర్‌ నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో జిల్లా ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శంషాబాద్‌ ఎక్సైజ్‌ సిబ్బందితో పాటు ఎస్వోటీ పోలీసులు గురువారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నిషేదిత మత్తు పదార్ధాలు భారీగా పట్టుబడ్డాయి. దలరాం అనే వ్యక్తి ఈ దందాకు తెరలేపినట్లు తేలింది. నకిలీ మీరజ్‌, విమల్‌ గుట్కాల తయారీలో నల్లమందు పౌడర్‌ను వాడుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. డూప్లికేట్‌ పాన్‌పరాగ్‌ తయారీలో కూడా ఈ మత్తుమందు వాడుతున్నట్లు తేలిందని చెప్పారు. ఈ మేరకు ఎన్టీబీఎస్‌ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ దశరథ, శంషాబాద్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ కృష్ణప్రియతో పాటు ఆయా శాఖల సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 09:33 AM