Share News

మున్సిపాలిటీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

ABN , Publish Date - May 23 , 2024 | 11:38 PM

ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గ్రామాలతో పాటు మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ నాయకులు గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
సీఎం రేవంత్‌రెడ్డితో కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, మే 23: ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గ్రామాలతో పాటు మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ నాయకులు గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధుల మంజూరుకు ప్రభుత్వ పరంగా కృషి చేయాలని మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ గుర్రం కేశవులు, వైస్‌ ఎంపీపీ జక్కు అనంతరెడ్డిల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రూ.10 కోట్లతో కార్యాచరణ రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో రూ.17.50 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులు వారం రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని నారాయణరెడ్డి తెలిపారు. నిలిచిపోయిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణం పనులు కూడా వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తిచేసి వినియోగంలోకి తెస్తామని అన్నారు. డిగ్రీ కళాశాల తరగుతులను కూడా ఈ ఏడాది నుంచి ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల కోడ్‌ మూలంగా నిలిచిపోయిన అన్ని అభివృద్ధి పనులను కోడ్‌ ముగియగానే యుద్ద ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని గ్రామాలు, తండాలకు బీటీ రోడ్డు నిర్మించడం జరుగుతుందని, కల్వకుర్తి ఎత్తిపోతల డీ-82 కాల్వ నిర్మాణం కూడా ఆగస్టు నాటికి పూర్తిచేయడం జరుగుతుందన్నారు. నాయకులు ఖాదర్‌ ఖాద్రీ, విజయ్‌రాథోడ్‌, రవీందర్‌ తదితరులున్నారు.

సీఎంను కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డిని గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. హైదరాబాద్‌లో సీఎం నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వృత్తినైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు తోడ్పాటునందించాలని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా ఆమనగల్లులో వందపడకల ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు సురభి వెంకటేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:38 PM