Share News

టైర్‌ పేలి గాల్లోకి ఎగిరిన కారు

ABN , Publish Date - May 21 , 2024 | 11:39 PM

టైర్‌ పేలడంతో అదుపు తప్పిన కారు గాలిలోకి ఎగిరి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది. క్షతగాత్రులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

టైర్‌ పేలి గాల్లోకి ఎగిరిన కారు

పల్టీకొట్టి రోడ్డు పక్కన చెట్టుకు ఢీ

నలుగురికి స్వల్పగాయాలు..

క్షతగాత్రులంతా హైదరాబాద్‌ వాసులు

నల్లగొండ జిల్లాలో ఘటన

చిట్యాల రూరల్‌, మే 21 : టైర్‌ పేలడంతో అదుపు తప్పిన కారు గాలిలోకి ఎగిరి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది. క్షతగాత్రులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ఏర్పుల భాస్కర్‌, ఆయన భార్య సింధూర, వారి కుమార్తె ఏడాది చిన్నారితో పాటు వారికి సంబంధించిన లక్ష్మి, పూజ కారులో కట్టంగూరులో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో ఇబ్రహీంపట్నంకు బయలుదేరారు. చిట్యాల మండలం వెలిమినేడు శివారులోకి చేరుకోగానే వారి కారు టైర్‌ పేలడంతో ఒక్కసారిగా కారు గాల్లోకి 10 అడుగుల మేర ఎగిరి అదుపుతప్పి ఎడమవైపు 30 అడుగుల దూరంలోకి పల్టీ కొట్టి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. హైవేపై వాహనదారులు కారులో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీశారు. కారులో ఉన్న భాస్కర్‌, సింధూర, లక్ష్మి, పూజలకు గాయాలు కాగా.. చిన్నారికి ఎటువంటి గాయం కాలేదు. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న టోల్‌గేట్‌ వద్ద ఉన్న జీఎంఆర్‌కు సంబంధించిన 1033 అంబులెన్స్‌లోని ఈఎంటీ శ్రీనివాస్‌ క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కారు సమీపంలోని వారు ఆందోళనకు గురయయ్యారు. కారు ఎగిరిపడటం, అందులో ఉన్న నలుగురికి గాయాలు కావడం చిన్నారి ప్రాణాపాయం తప్పి క్షేమంగా ఉండటం వారి అదృష్టమని వాహనదారులు తెలిపారు. ప్రమాదంపై చిట్యాల ఎస్సై సైదాబాబును సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Updated Date - May 21 , 2024 | 11:39 PM