ప్రేమ వేధింపులు తాళలేక 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Aug 31 , 2024 | 11:20 PM
ప్రేమ పేరుతో 10వ తరగతి విద్యార్థి వేధింపులు తాళలేక 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.
బంట్వారం, ఆగస్టు 31: ప్రేమ పేరుతో 10వ తరగతి విద్యార్థి వేధింపులు తాళలేక 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఓగ్రామానికి చెందిన విద్యార్థిని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన విద్యార్థి కొద్దిరోజులుగా ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడు. దీంతో వేధింపులు తాళలేక సదరు విద్యార్థిని శుక్రవారం విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్లిన సమయంలో విద్యార్థిని ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే 108 వాహనంలో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన కూతురిని వేధించిన విద్యార్థిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా తమకు ఇంకా ఫిర్యాదు చేయలేదని, తండ్రి ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని బంట్వారం ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు.