Share News

మరో 3 రోజులు ఉత్కంఠ!

ABN , Publish Date - May 31 , 2024 | 11:47 PM

లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

మరో 3 రోజులు ఉత్కంఠ!

అందరి దృష్టి ఎన్నికల కౌంటింగ్‌పైనే..

చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల ఫలితాలపై నేతలు, పార్టీలు, ప్రజల్లో ఉత్సుకత

బీఎ్‌సఐటీలో చేవెళ్ల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు

మూడు చోట్ల మల్కాజిగిరి స్థానం ఓట్ల కౌంటింగ్‌

విజయావకాశాలపై అభ్యర్థుల ధీమా

సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే 13న జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వెలువడనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. చేవెళ్ల స్థానంలో 43 మంది, మల్కాజిగిరిలో 22 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపునకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు శశాంక, గౌతమ్‌ల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 4వ తేదీ ఉదయం ఆరు గంటలకల్లా లెక్కింపు కేంద్రాలకు అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లు చేరుకుంటారు. కౌంటింగ్‌ విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది పొరపాట్లకు తావివ్వకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫలితాలను ఆలస్యం చేయకుండా రౌండ్ల వారీగా వెంటవెంటనే ప్రకటించనున్నారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తిచేసేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

(రంగారెడ్డి అర్బన్‌/మేడ్చల్‌, ఆంధ్రజ్యోతి మే 31) : లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపునకు మరో మూడు రోజులే ఉంది. జూన్‌ 4 ఉదయం నుంచి ఓట్లు లెక్కిస్తారు. ఎన్నికల ఫలితాలపై సాధారణ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హోరాహోరీగా తలపడిన అభ్యర్థులు తమ విజయావకాశాలపై అంచనాలతో ధీమాగా ఉన్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓట్ల శాతంపై లెక్కలు ఇప్పటికే తీసుకున్నారు. అధికారులు కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజరవర్గాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 15,04,260 మంది కాగా, మహిళా ఓటర్లు 14,33,830 ఉన్నారు. 280 మంది ఇతరులు ఉన్నారు. మే 13న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 16,57,107 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్‌గా 56.4శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ స్థానం బరిలో 43 మంది అభ్యర్థులున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 8,53,237 మంది పురుషులు, 8,03,827 మంది మహిళలు, 43 మంది ఇతరులు ఉన్నారు. చేవెళ్ల మండలం గొల్లపల్లిలోని బండారు శ్రీనివాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 6గంటలకల్లా కౌంటింగ్‌ సిబ్బంది ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు వస్తారు. ర్యాండమైజేషన్‌ జరిపిన తర్వాత నియోజకవర్గాల వారీగా టేబుళ్లను కేటాయిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుళ్లు, మిగతా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలైన చేవెళ్ల, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌ నియోజకవర్గాలకు 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా సిబ్బంది అన్ని విధాలా సన్నద్ధమయ్యారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. సమయం వృథా చేయకూడదని, అదే సమయంలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా పూర్తి అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించేలా జిల్లా ఎన్నికల అధికారి శశాంక చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్‌ అధికారులు, రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు అన్ని నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అధికారులు.. అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు తెలియజేస్తారు. ఈవీఎంల ఓట్లను ఒక్కో రౌండ్‌ వారీగా లెక్కిస్తూ, ప్రతీ రౌండ్‌ లెక్కింపు పూర్తిచేసిన తరువాత ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వెంటనే సరిచేసేలా సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. కౌంటింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వివిధ కార్యకలాపాల నిర్వహణకు నియమించిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించేలా ట్రైనింగ్‌ ఇచ్చారు. కౌటింగ్‌ హాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించారు. కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. కౌంటింగ్‌ సెంటర్‌లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని, సిబ్బందికి అల్పాహారం, భోజనాలను కూడా కౌంటింగ్‌ కేంద్రాల ఆవరణల్లోనే ఏర్పాటు చేస్తారు.

మూడు చోట్ల కౌంటింగ్‌

ఇక ఓటర్ల పరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ఈ నెల 13న ఎన్నికలు జరగ్గా.. ఏడు నియోజకవర్గాల పరిధిలో 2,528 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 39,79,596 మంది ఓటర్లకు 50.72శాతం మంది ఓటు వేశారు. నియోజకవర్గాల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. ఎప్పటి మాదిరిగానే టేబుళ్లపై ఈవీఎంలకు అనుసంధానించిన కంట్రోల్‌ యూనిట్లతో లెక్కింపును కొనసాగిస్తారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలుండగా.. మూడు చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును కీసరలోని హోళీ మేరీ ఇంజినీరింగ్‌ కాలేజీలో.. ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును సరూర్‌నగర్‌ స్టేడియంలో, కంటోన్మెంట్‌ నియోజకవర్గ ఓట్లను వెస్లీ కాలేజీలో లెక్కించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

గంటకు నాలుగు రౌండ్లు

ఒక్కో రౌండుకు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. గంటకు నాలుగు రౌండ్లు పూర్తవుతాయి. ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే రౌండ్ల వారీగా ఓట్లను క్రోడీకరించి ఫలితం ప్రకటిస్తారు. ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. మేడ్చల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో అత్యధికంగా 21రౌండ్ల లెక్కింపు జరుగనుండటంతో 5గంటలకుపైగా సమయం పడుతుంది. ఆ తర్వాతే తుది ఫలితం వెలువడనుంది. విజేత ఎవరో మధ్యాహ్నం 2గంటల కల్లా తెలిసే అవకాశమున్నా... అధికారికంగా మాత్రం సాయంత్రమే ప్రకటన వెలువడుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

లెక్కిస్తారిలా ...

కౌంటింగ్‌ కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన టేబుళ్లపై రౌండ్లు, పోలింగ్‌ కేంద్రాల వారీగా కంట్రోల్‌ యూనిట్లను తీసుకొచ్చి రిజల్ట్‌ మీటనొక్కి అభ్యర్థులకు పడిన ఓట్లను నమోదు చేస్తారు. చివరగా 17ఏ ఫాంను పరిశీలించి పోలైన ఓట్లను సరిచూశాక అన్ని టేబుళ్ల వారీగా అభ్యర్థులకొచ్చిన ఓట్లను రౌండ్ల వారీగా వెల్లడిస్తారు. అభ్యర్థుల, ఏజెంట్ల సమక్షంలో ఒక్కో టేబుల్‌ వద్ద కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంటు, మైక్రోఅబ్జర్వర్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు.

Updated Date - Jun 01 , 2024 | 12:13 AM