Share News

ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా 162 మంది బాలలకు పని నుంచి విముక్తి

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:22 AM

ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం ద్వారా 162 మంది బాలలకు పని నుంచి విముక్తి కల్గించామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా 162 మంది బాలలకు పని నుంచి విముక్తి
మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌, ఫిబ్రవరి 1 : ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం ద్వారా 162 మంది బాలలకు పని నుంచి విముక్తి కల్గించామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం ఆపరేషన్‌ స్మైల్‌-10 ముగింపు సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నెల ఆరంభం నుంచి ఆఖరు వరకు నిర్వహించిన ఆపరేషన్‌ స్మైల్‌లో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో వివిధ పనుల్లో ఉన్న 162 మంది బాలలను గుర్తించి స్కూళ్లలో జాయిన్‌ చేశామన్నారు. బాలల భవిష్యత్తును కాపాడటం గొప్ప విషయం అని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి పిల్లలను కాపాడటం తమకు సంతోషాన్ని ఇస్తోందన్నారు. మొత్తం 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. జనవరిలో గుర్తించిన 162 మంది బాలల్లో 150 మంది బాలురు, 12 మంది బాలికలు ఉన్నారన్నారు. వారిలో 44 మంది ఇతర రాష్ట్రాల వారన్నారు. స్కూలు వెళ్లే వయసున్న బాలలను ఎవరైనా పనుల్లో పెట్టుకుంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. బడీడు బాలబాలికలు ఉండాల్సింది పనుల్లో కాదు.. బడుల్లో అని ఆయన అన్నారు. దీనిపై పౌరులు, తల్లిదండ్రులు అందరూ ఆలోచించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, తమ ప్రాంతాల్లో ఎవరైనా బాలలతో పనులు చేయించినా, బిక్షాటన చేయించినా, ఫ్యాక్టరీల్లో పనిలో పెట్టుకున్నా వెంటనే పోలీస్‌ అధికారులకు కానీ లేదా డైల్‌100కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ఆపరేషన్‌ స్మైల్‌లో పాల్గొన్న అధికారులకు ఈ సందర్భంగా ప్రశాంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎల్‌వో శ్రీనివాస్‌రావు, ఐటీసీటీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రాజు, ఎస్‌ఐలు, బాలల సంక్షేమ శాఖ అధికారులు నరేష్‌కుమార్‌, ఆంజనేయులు, షఫీ, చైల్డ్‌లైన్‌ తరపున ఆనంద్‌, మహేష్‌, కార్మిక శాఖ నుంచి వినాయకరావు, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:22 AM