Share News

మహేశ్వరంలో రూ.150 కోట్ల ఎస్‌డీఎఫ్‌ ఫండ్స్‌ నిలిపివేత

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:13 AM

జిల్లాలోని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌(ఎ్‌సడీఎఫ్‌) కింద రూ.150 కోట్లు మంజూరు చేసింది. అధికారులు ఆయా అభివృద్ధి పనులకు అంచనాలు సిద్ధం చేసి, శంకుస్థాపనలు కూడా చేశారు.

మహేశ్వరంలో రూ.150 కోట్ల ఎస్‌డీఎఫ్‌ ఫండ్స్‌ నిలిపివేత

మున్సిపాలిటీల్లో నిలిచిన డ్రైనేజీ, రోడ్లు, ఇతర నిర్మాణ పనులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : జిల్లాలోని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌(ఎ్‌సడీఎఫ్‌) కింద రూ.150 కోట్లు మంజూరు చేసింది. అధికారులు ఆయా అభివృద్ధి పనులకు అంచనాలు సిద్ధం చేసి, శంకుస్థాపనలు కూడా చేశారు. తీరా పనులు ప్రారంభించాల్సిన సమయంలో గతంలో కేటాయించిన నిధులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జూన్‌ 19నమహేశ్వరం నియోజకవర్గం తుమ్మలూరులో హరితహారం కార్యక్రమాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహేశ్వరం నియోజకవర్గానికి నిధుల వర్షం కురిపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరిక మేరకు మహేశ్వరం నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల కోసం రూ.150 కోట్లు మంజూరు చేశారు. అందులో బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌ మున్సిపాలిటీలకు రూ.50 కోట్లు, తుక్కుగూడ, జల్‌పల్లి మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.50కోట్లు మంజూరు చేశారు. అలాగే తుక్కుగూడకు రూ.25 కోట్లు, జల్‌పల్లికి రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఆ మేరకు పాలనాపరమైన అనుమతి కూడా ఇచ్చారు. సీఎం హామీ మేరకు సంబంధిత అధికారులు మున్సిపాలిటీల్లోని వార్డులు, కాలనీలవారీగా డైన్రేజీ, రోడ్ల నిర్మాణాలకు అంచనాలు రూపొందించారు. అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా పనులకు శంకుస్థాపనలు కూడా చేయించారు. తీరా పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్‌ రావడంతో ఆయా పనులను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటమి పాలై, కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేసీఆర్‌ మంజూరు చేసిన రూ.150 కోట్ల నిధులను రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గ్రౌండింగ్‌ దశలో ఉన్న పనులన్నీ నిలిపివేయాల్సిందిగా ఇటీవల కలెక్టర్‌ ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో మున్సిపాలిటీల్లో ప్రతిపాదించిన అభివృద్ధి పనుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

ఇదిలా ఉండగా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడ, బాలపూర్‌ మండల పరిధిలోని 65 గ్రామ పంచాయతీల్లో కుల సంఘాల భవనాలు నిర్మించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 9.90 కోట్లు మంజూరు చేసింది. కొన్నిచోట్ల సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు చేశారు. కానీ.. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధులు నిలిపి వేసినట్లు తెలిసింది. దాంతో కుల సంఘాల నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

నిధులు నిలిపివేయడం అన్యాయం

గత సీఎం కేసీఆర్‌ను ఒప్పించి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించాను. ప్రొసీడింగ్స్‌ కూడా ఇచ్చారు. మున్సిపాలిటీలు, వార్డులవారీగా చేపట్టాల్సిన పనులను గుర్తించి అంచనాలు రూపొందించాం. తీరా పనులు ప్రారంభించే సమయంలో స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ కింద మంజూరుచేసిన నిధులను నిలిపివేయడం అన్యాయం. ప్రభుత్వ నిర్ణయంతో మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, జల్‌పల్లి, తుక్కుగూడ అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. గత ప్రభుత్వం కేటాయించిన నిధులు కేటాయించకపోగా, కొత్తగా ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల చొప్పున ఫండ్స్‌ మంజూరు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. నిలిపివేసిన నిధులను తక్షణమే మంజూరు చేయించాలి.

- సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వరం

Updated Date - Jan 12 , 2024 | 12:13 AM