Share News

యాసంగి సాగునీటి గోస

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:15 AM

ఒకపక్క భూగర్భ జాలాలు అడుగంటుతుండడం.. మరో పక్క కరెంట్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో అన్నదాతలకు సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి.

యాసంగి సాగునీటి గోస
గౌస్‌నగర్‌లో వరి పైరుకు వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా నీటిని పోయించుకుంటున్న రైతు చంద్ర మల్లయ్య

ఎండుతున్న వరిచేలు

ట్యాంకర్లతో తడులు ఇస్తున్న రైతు

భువనగిరి రూరల్‌, మార్చి 28: ఒకపక్క భూగర్భ జాలాలు అడుగంటుతుండడం.. మరో పక్క కరెంట్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో అన్నదాతలకు సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. మండలంలోని గౌస్‌నగర్‌కు చెందిన చిన్నకారు రైతు నల్లమాస చంద్రమల్లయ్య తనకున్న మూడు ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసుకుంటున్నాడు. అయితే గత రెండు వారాల నుంచి ఎండలు తీవ్రతరం అవడం, కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఒక బోరు పూర్తిగా వట్టిపోయి మరో బోరులో నీరు సక్రమంగా పొలాల్లోకి రాకపోవడంతో ఎకరం పొలం పూర్తిగా ఎండిపోయింది. మరో రెండు ఎకరాల పొలాన్ని కాపాడుకునేందుకు గాను భగీరథ ప్రయత్నంగా ఆయన ప్రతీరోజు మూడు వాటర్‌ ట్యాంకర్ల ద్వారా దాదాపు రూ.3వేలు చెల్లించి నీటిని కోనుగోలు చేసుకుంటున్నాడు. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళ్లలో ట్యాంకర్లతో వరి చేనును నీటితో తడుపుతున్నాడు. కాగా మరో 15 రోజుల్లో పంట చేతికి వస్తుందని అప్పటివరకు వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా నీటిని కోనుగోలు చేసుకొని పంటను దక్కించుకుంటున్నట్టు తెలిపాడు.

నీరులేక..జీవాలకు పశుగ్రాసంగా..

మోటకొండూర్‌ : మండల కేంద్రానికి చెందిన మలిపెద్ది సంజీవరెడ్డి అనే కౌలురైతు 12ఎకరాలను కౌలుకు తీసుకుని వరి పంట సాగుచేశాడు. ఆరు ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. దిక్కుతోచని స్థితిలో చేసేదేంలేక ముగజీవాలకు పశుగ్రాసంగా ఇచ్చేశాడు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికి వచ్చే సమయంలో ఎండి పోవడంతో పంటపై పెట్టిన పెట్టుబడి కుడా రాకపోవడంతో కన్నీళ్లే మిగిలాయి. ప్రభుత్వం పంటను పరిశీలించి ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

పాలడుగులో మంచినీటి ఎద్దడి

మోత్కూరు : మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో ప్రజలకు తాగునీరు అందించే బావులు, బోర్లలో భూగర్భజలాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడిందని గ్రామ ప్రజలు తెలిపారు. గ్రామంలోని అన్ని వీథులు, ఇళ్లలోకి రోజూ నీరు సరఫరా అవుతున్నప్పటికీ సరిపోయేంత నీరు రావడం లేదంటున్నారు. మిషన భగీరథ నీరు గ్రామ ప్రజల అవసరాలకు తగినంత రాదని, సుమారు 25 శాతం నీరు మాత్రమే సరఫరా అవుతుందని ఆ గ్రామ మాజీ సర్పంచ మర్రిపెల్లి యాదయ్య తెలిపారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని రెండు బావులు, రెండు బోర్ల ద్వారా గ్రామానికి మంచినీరు అందిస్తున్నారన్నారు. వేసవి కావడంతో ఒక బావిలో నీరు (భూగర్భజలాలు) బాగా తగ్గిపోయిందన్నారు. మరో బావిలో పూడిక తీయించాల్సి ఉందన్నారు. గ్రామంలో నెలకొన్న మంచి నీటి ఎద్దడిని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్‌ దృష్టికి తీసుకెళ్లగా రూ.1.50లక్షల రూపాయలు మంజూరు చేశారని ఆయన చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న ఏప్రిల్‌, మే మాసాల్లో ఎలా ఉంటుందోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Mar 29 , 2024 | 12:15 AM