Share News

యాదగిరీశా.. నీవే దిక్కు

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:32 AM

వేసవి ఆరంభం కాక ముందే యాదగిరిగుట్టలో ఎండలు మండుతున్నాయి.

యాదగిరీశా.. నీవే దిక్కు
యాదగిరిగుట్టలో కొండపైన వీఐపీ దర్శనం కోసం విచ్చేసే భక్తుల కోసం ఏర్పాటుచేసిన చలువపందిళ్లు

వేసవికి ముందే మండుతున్న ఎండలు

యాదగిరి క్షేత్రంలో 37డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

కార్పెట్‌లు, మ్యాట్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్న భక్తులు

యాదాద్రి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): వేసవి ఆరంభం కాక ముందే యాదగిరిగుట్టలో ఎండలు మండుతున్నాయి. సాధారణంగా ఎండా కాలం మార్చి నెలాఖరు నుంచి మే చివరి వరకు ఉంటుంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం వేళ మబ్బులు కమ్మినట్టుగా ఉన్నటువంటి వాతావరణం తొమ్మిది గంటలు కాగానే ఎండలు ప్రారంభమవుతున్నాయి. వారం రోజులుగా యాదగిరిగుట్ట మండలంలో గరిష్ట ఉష్ణోత్రలు 36డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఈ నెల 22న 37.6డిగ్రీలు, 23న 36.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహిమాన్విత స్వయంభూ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ప్రధానాలయంతో పాటు ప్రాంగణమంతా కూడా కృష్ణరాతి శిలలతో నిర్మించారు. ఉష్ణోగత్రలు పెరిగిపోవడంతో ఆలయ ప్రాంగణంలో రాతి శిలల వేడికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొండపైన ఉక్కపోత, ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరిలోనే ఇలాంటి పిరిస్థితి ఉంటే.. ఏప్రిల్‌, మే నెలల్లో ఎలా ఉంటుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కొండపై చలువ పందిళ్లు మార్చి నెలలోనే వేయాలని కోరుతున్నారు. భక్తులు దర్శన క్యూకాంప్లెక్స్‌ల నుంచి ప్రధానాలయ తూర్పు రాజగోపురం ద్వారా గర్భాలయంలోకి ప్రవేశిస్తున్నారు. క్యూకాంప్లెక్స్‌లో, ప్రధానాలయంలో ఉన్నంత వరకు ఎండల నుంచి భక్తులు ఉపశమనం పొందుతున్నారు. గర్భగుడిలో స్వామివారి దర్శనాంతరం పశ్చిమం వైపు ఉన్న సప్తతల మహారాజగోపురం, వేంచేపు మండపం నుంచి భక్తులు బయటకు రావాలి. అయితే ఆలయ ప్రాంగణమంతా రాతిబండలు ఉండటంతో ఎండకు అవి వేడెక్కుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని తిరువీధుల్లో మ్యాట్‌లు లేకపోవడంతో ఎండలకు రాతిబండలపై నడవలేక ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. కొండపైన బస్టాండ్‌ వరకు కాలినడకన వెళ్లాలంటే భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కొండపైన భక్తులు నడిచేందుకు వైట్‌ పెయింట్‌ ఏర్పాటుచేశారు. అయితే భక్తులు తిరువీధుల్లో రాతిబండలపై నుంచి పాదరక్షకులు లేకుండా వైట్‌ పెయింట్‌పై నడవాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. స్వామిదర్శనం అనంతరం శివాలయం పక్కన ఉన్నటుంటి ప్రసాదాల కౌంటర్‌కు, ప్రసాదాలను తీసుకుని బస్టాండ్‌కు చేరుకోవాలి. అయితే ఎండల నుంచి ఉపశమనం పొందేలా ఆలయ అధికారులు చలువ పందిళ్లు...మ్యాట్‌లను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రధానాలయం ప్రాంగణంతో పాటు కొండకింద బస్టాండ్‌ వరకు కార్పెట్‌ ఏర్పాటు చేయాలనికోరుతున్నారు. వీఐపీ టిక్కెట్‌ తీసుకుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం తాత్కాలికంగా చలువపందిళ్లు ఏర్పాటుచేయగా, శివాలయం నుంచి బస్టాండ్‌ వరకు చలువపందిళ్లు ఏర్పాటుచేయాలని భక్తులు కోరుతున్నారు.

మార్చి 11నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు షురూ..

భక్తజన బాంధవుడు లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు మార్చి 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ప్రారంభం నాటికైనా కొండపైన ఎండలకు ఉపశమనం పొందేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ముక్కోటి దేవతలు ఆహూతులుగా లోకకల్యాణం.. విశ్వశాంతి కోసం అంగరంగవైభవంగా 11రోజుల పాటు జరిగే లక్ష్మీనరసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 11న స్వస్తివాచనంతో ప్రారంభమై.. 21న అష్టోత్తర శతఘటాభిషేకం..శృంగార డోలోత్సవంతో పరిసమాప్తమవుతాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లను చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.

భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు

వేసవిలో భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. కొండపైన వైట్‌ పెయింట్‌తోపాటు కార్పెట్లు కూడా ఏర్పాటు చేయనున్నాం. వీఐపీ దర్శనాల కోసం విచ్చేసే భక్తుల కోసం చలువపందిళ్లు ఏర్పాటుచేస్తున్నాం. కొండపైన శివాలయం ముందుకు భక్తులు నడిచే దారిలో చలువపందిళ్లు వేయనున్నాం. అవసరమైతే కార్పెట్‌లు కూడా ఏర్పాటు చేస్తాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం. అవసరమైన ప్రాంతాల్లో మొబైల్‌ టాయిలెట్‌లు అందుబాటులో ఉంచుతాం.

- రామకృష్ణారావు, యాదగిరిగుట్ట ఆలయ ఈవో

Updated Date - Feb 26 , 2024 | 12:32 AM