Share News

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:54 PM

మోత్కూరు మండల కేంద్రంలో ఓ మహిళ బావిలో పడి మృతి చెందింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మోత్కూరు, జూన 12: మోత్కూరు మండల కేంద్రంలో ఓ మహిళ బావిలో పడి మృతి చెందింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... భువనగిరి రైల్వేస్టేషన సమీపంలోని కాకినాడ బస్తీకి చెందిన మాటూరి కవిత (38) అదే పట్టణానికి చెందిన వంట మాస్టర్‌ నర్సింహతో కలిసి వంటలు చేయడానికి వెళుతుందంటున్నారు. బుధవారం వారిద్దరు వేములకొండలో బంధువుల చావుకు వెళ్లి, ఆ తర్వాత మోత్కూరులో తన సోదరి కొంగరి మమత ఇంటికి వచ్చి, స్నానాలు చేయడానికి మోత్కూరులో చెరువుకట్ట పక్కన ఉన్న ముత్యాలమ్మ బావి వద్దకు వెళ్లారు. అక్కడ అప్పటికే ఒరిద్దరు బావిలో ఈత కొడుతున్నారు. కవిత కూడ తనకు ఈత వస్తుందని అనడంతో, ఈత వస్తే బయట నిలబడటమెందుకు బావిలోకి దూకు అంటూ వెంట ఉన్న నర్సింహ ఆమెను తోశాడు. ఆమె పక్కనే ఉన్న మరొకామెను పట్టుకోగా బ్యాలెన్సు తప్పి ఇద్దరు మహిళలు బావిలో పడిపోయారు. కవిత నీటిలో మునిగిపోగా ఆమెతో పాటు బావిలో పడిన మరో మహిళ ఒడ్డుకు చేరుకుంది. ఆమె మునగడం చూసి నర్సింహ బావిలోకి దూకి ఆమెను బయటకు తీయడానికి యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అతను పరార్‌ అయ్యాడు. అక్కడ ఉన్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఆమెను వెలికి తీయగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఽరామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం రామన్నపేట ఆస్పత్రికి తరలించి, కవిత చెల్లెలు కొంగరి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రామన్నపేట సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ ఎ.శ్రీకాంతరెడ్డి తెలిపారు.

Updated Date - Jun 12 , 2024 | 11:55 PM