Share News

బడి ఊడ్చేదెవరో?

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:18 AM

వేసవి సెలవులు మంగళవారంతో ముగిసి 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే సమస్యలతో పాఠశాలలు స్వాగతం పలుకుతున్నాయి.

బడి ఊడ్చేదెవరో?

రేపటి నుంచి పునఃప్రారంభం కానున్న పాఠశాలలు

స్కావెంజర్లను తీసేసిన గత ప్రభుత్వం

పంచాయతీ పారిశుధ్య కార్మికులతో నిర్వహణ

అరకొరగా నిర్వహణతో అపరిశుభ్రత

కొన్ని చోట్ల ఉపాధి కూలీ డబ్బులతో నిర్వహణ

మరికొన్ని చోట్ల సొంత డబ్బులు వెచ్చిస్తున్న హెచ్‌ఎంలు

నార్కట్‌పల్లి: వేసవి సెలవులు మంగళవారంతో ముగిసి 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే సమస్యలతో పాఠశాలలు స్వాగతం పలుకుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో బడులకు కొత్త సొబగులు దిద్దుతున్నా, పారిశుధ్య పనుల నిర్వహణ ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలలను ఊడ్చే దెవరో? మరుగుదొడ్లను శుభ్రం చేసేదెవరో? అర్థంకాని పరిస్థితి. వసతుల కల్పనలో భాగంగా పాఠశాలల్లో పారిశుధ్యం విషయంలో గత ప్రభుత్వ విధానాన్నే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే విషయం ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశమైంది.

గతంలో మరుగుదొడ్లు, పాఠశాల పారిశుధ్యం పనుల నిర్వహణకు ప్రత్యేకంగా స్కావెంజర్ల వ్యవస్థ ఉండేది. తాత్కాలిక వేతనంతో వీరిని నియమించేవా రు. విద్యార్థుల సంఖ్య 100లోపు ఉంటే ఒక స్కావెంజర్‌, 100 దాటితే ఇద్దరిని నియమించారు. అందుకు స్కావెంజర్లకు నెలకు ప్రాథమిక పాఠశాలల్లో రూ.2,000లు,ఉన్నత పాఠశాలల్లో రూ.2,500లు వేతనంగా మండల విద్యాధికారి ద్వారా చెల్లించేవారు. కాగా, రెండేళ్ల కిందట అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాఠశాలల్లో స్కావెంజర్ల వ్యవస్థను తీసేసింది. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు, పట్టణాల్లో మునిసిపాలిటీకి అప్పజెప్పింది. పాఠశాలల గదులతో పాటు మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యత కూడా పంచాయతీ పారిశుధ్య సిబ్బందిదే. అయితే సరిపడా సిబ్బంది లేక గ్రామా లు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ అంతంత మా త్రంగా ఉన్న పరిస్థితుల్లో పాఠశాలల నిర్వహణ బా ధ్యత అదనంగా మారింది. దీంతో వారు పాఠశాలలవైపు చూడటం మానేశారు. ఫలితంగా పాఠశాలల్లో పారిశుధ్య పనుల నిర్వహణ అధ్వానంగా మారింది. దీంతో కొందరు ఉపాధ్యాయులు సొంత డబ్బు వెచ్చించి స్కావెంజర్లను ఏర్పాటు చేసుకోగా, మరికొన్ని పాఠశాలల్లో స్కావెంజర్ల వేతనాన్ని ఉపాధి హామీ పథకం కింద ఇచ్చేలా అనధికారిక అవగాహన చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున పారిశుధ్య పనుల నిర్వహణ ఎలా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలో 1,483 పాఠశాలలు

జిల్లాలో మొత్తం 1,483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,126 ప్రాథమి క, 128 ప్రాథమికోన్నత, 229 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 93వేలకు పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో 54వేల మందికిపైగా బాలికలే ఉన్నారు. అయితే మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రతీ పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించారు. నీటి వసతి కోసం గ్రామ పంచాయతీల ద్వారా నల్లా కనెక్షన్‌ ఇచ్చారు.

స్కావెంజర్లను నియమించాలి : గోపీనాథ్‌, ఎస్‌ఎ్‌ఫఐ డివిజన్‌ కార్యదర్శి

పాఠశాలల్లో పారిశుధ్య పనులను నిర్వహించే స్కావెంజర్ల వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసింది. ఇది సరైంది కాదు. పాఠశాలల నిర్వహణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దు. స్కావెంజర్ల వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాలి. పంచాయతీ కార్మికులకు అదనపు భారంగా మారిన పాఠశాలల పారిశుధ్య బాధ్యతలను రద్దు చేయాలి. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం పునరాలోచన చేయాలి.

ప్రభుత్వం హామీని నెరవేర్చాలి : శేఖర్‌రెడ్డి, యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి

పాఠశాలల్లో స్కావెంజర్ల వ్యవస్థను ప్రభుత్వం పునరుద్ధరించి స్వచ్ఛ పాఠశాలలకు సహకరించా లి. ఇక్కడి పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను పంచాయతీలకు అప్పజెప్పడం సరైంది కాదు. ఈ విషయాన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో ఉపాధ్యా య సంఘాల నేతలు చర్చించినప్పుడు అందుకు హామీ ఇచ్చింది. పాఠశాలలు పునఃప్రారంభమవుతు న్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా ప్రకటన చేయాలి.

పంచాయతీ సిబ్బందితోనే..: కూకుట్ల నర్సింహ, నార్కెట్‌పల్లి ఎంఈవో

పాఠశాలల్లో పారిశుధ్య పను ల నిర్వహణకు సంబంధించి గతంలో ఉన్న మార్గదర్శకాలనే పాటించనున్నాం. పంచాయతీ ప్రత్యేక అధికారులను కలిసి పాఠశాలల శుభ్రం కోసం సిబ్బందిని పంపించేలా విజ్ఞప్తి చేయాలని హెచ్‌ఎంలకు సూచించాం. స్కావెంజర్ల వ్యవస్థ పునరుద్ధరణపై మాకు ఎలాంటి సమాచారం లేదు.

Updated Date - Jun 11 , 2024 | 12:18 AM