Share News

ప్రజాసంఘాలు ఎవరివైపో?

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:52 PM

లోక్‌సభ ఎన్నికల సమరానికి అన్ని ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు ప్రజాసంఘాల మద్దతు ఎవరికి ఉంటుందన్న అంశంపై చర్చ మొదలైంది.

ప్రజాసంఘాలు ఎవరివైపో?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలతో చర్చలు షురూ

భువనగిరి నుంచి ఇద్దరు బీసీలు, మైనార్టీ, ఒకరు ఓసీ

నల్లగొండ నుంచి ముగ్గరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): లోక్‌సభ ఎన్నికల సమరానికి అన్ని ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు ప్రజాసంఘాల మద్దతు ఎవరికి ఉంటుందన్న అంశంపై చర్చ మొదలైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నేతలతో చర్చించి తమకే మద్దతు పలకాలని పార్టీ అధిష్ఠానాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఆయా సంఘాలు ఎవరికి మద్దతిస్తాయోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ, ఓటర్ల మద్దతు కూడగట్టుకునే పనిలో పార్టీలు ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికలను అన్నిపార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. భువనగిరి, నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానాల బరిలో బీసీలకు స్థానం కల్పించాలని పలు సంఘాలు అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశాయి. నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డిని, బీఆర్‌ఎస్‌ తరఫున కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి అభ్యర్థులుగా అధిష్ఠానాలు ప్రకటించాయి. భువనగిరి పార్లమెంట్‌ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, బీఆర్‌ఎస్‌ నుంచి క్యామ మల్లేష్‌, సీపీఎం తరఫున ఎండీ జహంగీర్‌ను ప్రకటించాయి. రాష్ట్రంలో 17 నియోజకవర్గాలకు ఒక్క భువనగిరిలోనే సీపీఎం పోటీలో ఉంది. మిగతా నియోజకవర్గాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అం శంపై పార్టీలో చర్చ సాగుతున్నట్లు తెలస్తోంది. అయితే భు వనగిరిలో ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్‌ మినహాయించి బీఆర్‌ఎ స్‌, బీజేపీ, సీపీఎం(మైనార్టీ)లు బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి టికెట్లు ఇచ్చాయి. నల్లగొండ నియోజకవర్గం లో మాత్రం ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య పోటీ నెలకొంది. భువనగిరిలో ముగ్గురు బీసీలు, ఒక ఓసీ మధ్య రసవత్తరమైన పోటీ ఉండనుంది. అయితే మూ డు పార్టీలకు చెందిన అభ్యర్థులను బీసీలను ఎంపీ అభ్యర్థి గా ప్రకటించడంతో బీసీసంఘాల నేతలు ఎవరివైపు మొగ్గు చూపుతారన్న అంశంపై ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. భువనగిరి నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు ఎవరి వైపు ఉంటారన్నది కూడా పార్టీ అధిష్ఠానాల్లో కలవరం మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే సామాజిక కోణంలో అన్ని పార్టీలు తమ వైపు ఓటర్లను తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

బీఎస్పీ పోటీల్లో ఉన్నట్టా.. లేన్నట్టా..?

నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నిక ల బరిలో బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) పోటీలో ఉం టుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇటీవల బీఆర్‌ఎస్‌ లో చేరి నాగర్‌కర్నూల్‌ నియోకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే ఆయన మొదటి నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా వేదికగానే రాజకీయాలు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో మాత్రం బీఎస్పీ అభ్యర్థులపై ఎలాంటి చర్చలేదు. త్వరలోనే రాష్ట్ర కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఈ ఎన్నికల్లో పోటీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంశంపై చర్చించనున్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి వివరాలు సేకరించనున్నారు. పల్లెలు, పట్టణాల్లో బీఎస్పీ తరఫున ప్రచారాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల్లో ఎస్సీ, బీసీ ఓటర్లు అధికంగా ఉన్నందున, ఎన్నికల బరిలో బీఎస్పీ తరఫున బీసీ నేతలను రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. త్వరలో పార్టీ అభ్యర్థిని ప్రకటించి, నామినేషన్‌ వేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

టీడీపీని బలోపేతం చేసేందుకు..

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అయితే పార్లమెంట్‌ ఎన్నికల బరిలో ఉండాలా? లేదా? అన్న దానిపై అధిష్ఠానం నిర్ణయం కోసం స్థానిక నేతలు వేచి చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశాన్ని నిర్వహించి, తాజా పరిస్థితులపై చర్చించారు. గతంలో నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉండేది. ఎంపీగా కూడా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి, తమ సత్తా ఏమిటో తేల్చుకుందామని పలువురు నేతలు అధిష్ఠానంతో చర్చలు జరిపారు. స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే టీడీపీ అభిమానులు, సానుభూతిపరులు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారన్న అంశంపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

Updated Date - Apr 07 , 2024 | 11:52 PM