లష్కర్లు ఏరీ?
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:15 AM
ప్రాజెక్టులు నిండి కాల్వలకు నీటిని విడుదలచేస్తే వాటి నిర్వహణలో లష్కర్లది కీలక భూమిక. కాల్వల వెంట తిరుగుతూ ఎక్కడ గండిపడినా అధికారులకు సమాచారం ఇవ్వడం, నీటి చౌర్యం జరగకుండా అడ్డుకోవడం వీరి విధి. నీటి విడుదలకు ముందే ఎక్కడెక్కడ కట్టలు బలహీనంగా ఉన్నాయో గుర్తించి అధికారులను వీరు అప్రమ త్తం చేస్తుంటారు.

చెరువుల పర్యవేక్షణ, నీటి విడుదలకు సిబ్బంది కొరత
జలాశయాలకు గండిపడితే చూసే వారు కరువు
పోస్టుల భర్తీపై దృష్టి సారించని అధికారులు
భారీ వర్షాలు వస్తే జలాశయాలకు పొంచివున్న ముప్పు
నల్లగొండ: ప్రాజెక్టులు నిండి కాల్వలకు నీటిని విడుదలచేస్తే వాటి నిర్వహణలో లష్కర్లది కీలక భూమిక. కాల్వల వెంట తిరుగుతూ ఎక్కడ గండిపడినా అధికారులకు సమాచారం ఇవ్వడం, నీటి చౌర్యం జరగకుండా అడ్డుకోవడం వీరి విధి. నీటి విడుదలకు ముందే ఎక్కడెక్కడ కట్టలు బలహీనంగా ఉన్నాయో గుర్తించి అధికారులను వీరు అప్రమ త్తం చేస్తుంటారు. ఇంతటి కీలక విధు లు నిర్వహించే లష్కర్ల పోస్టుల భర్తీని ప్రభుత్వాలు ఏళ్లుగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా నిర్వహణ లేక కాల్వలు బలహీనంగా మారాయి.
కృష్ణానది ఎగువ ప్రాంతాలైన కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రభావం మొ దలైంది. ప్రవాహం ఇలాగే కొనసాగి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో పెరిగితే కాల్వలకు నీటి విడుదల చేసే అవకాశం ఉంది. సాగర్ నిండితే ఆయకట్టులోని పలు చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేస్తారు. ఏఎమ్మార్పీ కింద ఉన్న చెరువులకు కూడా కృష్ణ జలాలు చేరుతాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు నీరు చేరడంతో పాటు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కూడా చేశారు. డిండి ప్రాజెక్టుకు సైతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురిసే వర్షాలతో రానున్న రోజుల్లో వరద వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ పథకం కిం ద పలు చెరువులను పునరుద్ధరించారు. దీంతో కొన్ని చెరువులు పటిష్టంగా అ యినా, మరికొన్ని చెరువులు మరమ్మతులకు నోచుకోకపోవడంతో కట్టలు బలహీనం గా ఉన్నాయి. ఈ నేపథ్యం లో జూన్ నుంచి నీటి సంవత్సరం మొదలైనా, ఇప్పటి వరకు భారీ వర్షాలు లేకపోవడంతోజలాశయాల్లో నీరు చేరలేదు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే సాగర్ నిండితే చెరువులకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే చెరువుల పటిష్టతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలతో వరదలు వస్తే చెరువులకు గండిపడే ముప్పు ఉంది.
ఉమ్మడి జిల్లాలో 3,119 చెరువులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 3,119 చెరువులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 1,628, సూర్యాపేట జిల్లాలో 1,224 చెరువులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 267 చెరువులు ఉన్నాయి. అయితే ఈ మూడు జిల్లాలో లష్కర్ల కొరత తీవ్రంగా ఉంది. చెరువులకు, ప్రాజెక్టులకు వచ్చే నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రతీ ప్రాజెక్టు వద్ద నిపుణులైన ఆపరేటర్ల అవసరం ఉంటుంది. సంబంధిత శాఖలో నిపుణులైన ఆపరేటర్ల కొరత ఉండటంతో ప్రైవేట్ ఏజేన్సీలపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. అవుట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్న వారిలో ఎంతమందికి నైపుణ్యం ఉంది అనేది గుర్తించడం కష్టంగా మారింది. గత సంవత్సరం కూడా వీఆర్‌ఏలను లష్కర్లు, ఇతర సహాయకులుగా విధుల్లో చేర్చుకున్నారు. వీరిలో ఎవ్వరికీ సరైన శిక్షణ ఇవ్వలేదు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఎసీ) ఆధ్వర్యంలో ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలన్నా నిబంధన ఉన్నా ఏళ్లుగా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఎవరైనా నిరుద్యోగులకు ఆసక్తి ఉంటే శిక్షణ ఇచ్చి నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఆపరేటర్లను నియమించాలని నిపుణులు సూచిస్తున్నారు. నీటి విడుదలకు ఎగువస్థాయి నుంచి ఆయకట్టు వరకు సిబ్బంది అవసరం. వారిలో లష్కర్లే కీలకం. అయినా సిబ్బంది కొరతను తీర్చాలన్నా ఆలోచన అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు కలగడం లేదు.
కొత్త పోస్టుల భర్తీ ఇప్పట్లో అసాధ్యమే!
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదలశాఖలో పోస్టుల భర్తీపై దృష్టి సారించలేదు. వివిధ గ్రూపుల పరీక్షల కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన తరువాతే ఈ పోస్టులు భర్తీకానున్నాయి. అయితే నోటిఫికేషన్ల జారీ ప్రస్తుతం లేకపోవడంతో ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. అయితే ముందుగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని జలాశయాలకు సంబంధించిన ఖాళీలను పూర్తిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అధికారులు మాత్రం సిబ్బంది కొరత లేదని చెబుతున్నా వాస్తవ పరిస్థితులను చూస్తే ఉమ్మడి జిల్లాలోని చెరువులు, కుంటలపై సిబ్బంది కొరత ఉంది. చాలా చెరువులను సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. చెరువుల పటిష్టత ఎలా విఽధంగా ఉందనే విషయాన్ని ఇప్పటి వరకు ఉన్నతాధికారులు పరిశీలించారనే దానిపై స్పష్టత లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది చెబితేనే చెరువుల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
క్షేత్ర స్థాయిలో కీలక సిబ్బంది ఏరీ?
కొన్ని చెరువులను మిషన్ కాకతీయ పునరుద్ధరించినప్పటికీ చాలా చెరువులకు కట్టలు పటిష్టంగా లేవు. కాల్వల్లో కంపచెట్లు పెరిగినా తొలగించే వారు కరువయ్యారు. తూ ములు, డిస్ట్రిబ్యూటర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం తో నీరు సాఫీగా సాగకుండా గండిపడే ప్రమాదాలు ఉన్నాయి. లష్కర్లు, ఫిట్టర్‌లు, గేట్ ఆపరేటర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఎలక్ట్రీషియన్ల కొరత అధికంగా ఉంది. నీటి పారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణ అనంతరం చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈఈ, ఏఈల వరకు పోస్టుల ను సర్దుబాటు చేసినా, క్షేత్రస్థాయిలో సిబ్బంది అరకొరగానే ఉన్నా రు.ప్రత్యామ్నాయంపై అధికార యంత్రాంగం చొరవ తీసుకోకపోవడంతో రానున్న రోజుల్లో సమస్యలు తీవ్రంగా ఉండనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో 3,119 చెరువు లు ఉండగా వర్క్ చార్టెడ్, ఫిట్టర్‌లు, గేట్ ఆపరేటర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు అంతా కలిపి 450మంది వరకు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇక మూడు జిల్లాలో హెల్పర్‌లు, లష్కర్లు మొత్తం సుమారు 327 మంది ఉన్నట్లు తెలిసింది. నల్లగొండ జిల్లాలో వర్క్ చార్టెడ్ సిబ్బంది తో పాటు ఫిట్టర్‌లు, గేట్ ఆపరేటర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఎలక్ట్రీషియ న్లు మొత్తం 214మంది ఉండగా,హెల్పర్లు,లష్కర్లు 127మంది ఉన్నారు.
ఎలాంటి సిబ్బంది కొరత లేదు : ఎస్.పార్వతీశ్వర్‌రావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్, నీటి పారుదల శాఖ, నల్లగొండ
నీటి పారుదలశాఖలో వర్క్ చార్టెడ్ సిబ్బందికి సంబంధించి ఎలాంటి కొరత లేదు. గతంలో వీఆర్‌ఏలను వర్క్ చార్టెడ్ పోస్టింగ్‌లల్లో సర్దుబాటు చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. జిల్లాలో ప్రస్తుతం చెరువుల్లో నీటిమట్టం మాములుగానే ఉంది. సిబ్బంది నిరంతరం పనిచేస్తూ పర్యవేక్షణ చేస్తున్నారు.