‘హైడ్రా’పై మీ అభిప్రాయం?
ABN , Publish Date - Sep 06 , 2024 | 12:14 AM
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో హైడ్రా తరహాలో అమలు కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక నాయకులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంప్రదింపులు
హుజూర్‌నగర్, సెప్టెంబరు 5: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో హైడ్రా తరహాలో అమలు కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయం కోరగా నేతలు సైతం హైడ్రాను అమలుచేయాలని సూచించినట్లు తెలిసింది. ఇటీవల వరద బాధితులను పరామర్శించిన రోజు నాయకులను హైడ్రాపై అభిప్రాయం కోరినట్లు చెబుతున్నారు. విఘ్నేశ్వరకాలనీ, శివాలయం వీధి, గోవిందాపురం రోడ్డు, పరపతి సంఘం సెంటర్, మట్టపల్లి బైపా్‌సరోడ్డు, శ్రీవేంకటేశ్వరస్వామి బైపా్‌సరోడ్డు ప్రాంతాల్లో వరదలతో జరిగిన నష్టాన్ని పరిశీలించి ఆక్రమణాలు తొలగించాలని ఆర్డీవో, కమిషనర్లను ఆదేశించారు. ప్రధానంగా మినీట్యాంక్ డిజైన మార్పుతో శివాలయం వీధి నుంచి పెద్దఎత్తున చెరువు నీరు పట్టణంలోకి రావడం గంగమ్మ దేవాలయం ప్రాంతం, శివాలయం పక్క ఇళ్లు మునిగిపోవడం మంత్రిని కలిచివేసింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా వంటి వ్యవస్థను అమలుచేయాలన్న ఆలోచన మరింతగా పెరిగిందంటున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంతో పాటు కోదాడ నియోజకవర్గంలోని పెద్దచెరువు ఆక్రమణలపై ఉత్తమ్ దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోట్లాది రూపాయల విలువచేసే శిఖం భూములు ఆక్రమించి రెండు నియోజకవర్గాల్లో పక్కా భవనాలు నిర్మించారు. అదేవిధంగా వందల కోట్ల విలువచేసే చెరువు భూములు కబ్జాచేసి భూస్వాములు సాగుచేస్తున్నారు. హుజూర్‌నగర్‌లోని విఘ్నేశ్వరకాలనీలో ఉండే దద్దనాల చెరువు ఇప్పుడు ఆనవాళ్లు లేకుండాపోయింది. 50 ఎకరాల చెరువు విస్తీర్ణంలో 15 ఏళ్లుగా 500 మంది ఇళ్ల నిర్మించారు. ప్రస్తుతం దద్దనాల చెరువు 100గజాలు కూడా లేదు. ఈ ఆక్రమణలతోనే వర్షం వస్తే చాలు విఘ్నేశ్వరకాలనీలోని 200 ఇళ్లు మునకకు గురవుతున్నాయి.
110 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సిన ముత్యాలమ్మచెరువు 60 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఒక ఊరే వెలిసింది. కళాశాలలు, అపార్ట్‌మెంట్లు, వెంచర్లు వెలిశాయి. ఒకనాడు ఎంబీ కెనాల్ నుంచి ఊరచెరువుకు నీరు వచ్చేందుకు 50 అడుగుల వెడల్పులో ఫీడర్ ఛానెల్ ఉండేది. ఇప్పుడు అది పిల్ల కాల్వలా మారింది. గతంలో శివాలయం చెరువుకట్టకు ఆనుకుని ఉండేది. శివాలయం ప్రాంతంలో కట్ట మీద అనేక ఇళ్లు నిర్మించారు. ముత్యాలమ్మ దేవాలయం ప్రాంతంలోని 6, 7 వార్డుల్లోని ఇళ్లు మొత్తం ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అమలు చేస్తే వచ్చే ఫలితాలు, విమర్శలపై సమగ్రంగా విళ్లేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హుజూర్‌నగర్‌లోనూ హైడ్రా అమలుచేయాలి
హుజూర్‌నగర్ ప్రాంతంలోని పేదలకు ఇళ్లు మంజూరు చేసి హైడ్రా అమలుచేయాలి. హైడ్రా అమలు చేస్తే భారీ వరదలు వచ్చినా ఇబ్బందులు తలెత్తవు. వర్షాలతో అనేక ప్రాంతాల్లోని ఇళ్లు నీటిలో చిక్కుకుంటున్నాయి. పేదలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.
పశ్య పద్మ, సీపీఐ రాష్ట్ర నాయకురాలు