Share News

ఫ్లోరైడ్‌ పీడను, మూసీ కాలుష్యాన్ని తరిమికొడతాం

ABN , Publish Date - Dec 08 , 2024 | 01:12 AM

నల్లగొండ జిల్లా పోరాటాల చరిత్రకు పెట్టింది పేరు.. ఈ గడ్డ పేరు తలిచినా, ఈ గాలి పీల్చినా ఒళ్లు పులకరిస్తుంది.. అలాంటి గడ్డను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్‌ పీడని, మూసీ కాలుష్యాన్ని తరిమికొడతాం.. సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఏ ప్రజా ఉద్యమమైనా నల్లగొండ ముందుంది.. కొండా లక్ష్మణ్‌బాపూజీ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, ధర్మభిక్షం వంటి యోధులు, శ్రీకాంతాచారి వంటి బిడ్డలు నడయాడిన నేల ఇది.. ఎందరో యోధులకు నిలయమైన ఈ జిల్లాను సస్యశ్యామలం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.. అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు.

ఫ్లోరైడ్‌ పీడను, మూసీ కాలుష్యాన్ని తరిమికొడతాం
బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

ప్రాజెక్టులను అడ్డుకునే వారి సంగతి ప్రజలే చూసుకోవాలి

నల్లగొండ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

నల్లగొండ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): నల్లగొండ జిల్లా పోరాటాల చరిత్రకు పెట్టింది పేరు.. ఈ గడ్డ పేరు తలిచినా, ఈ గాలి పీల్చినా ఒళ్లు పులకరిస్తుంది.. అలాంటి గడ్డను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్‌ పీడని, మూసీ కాలుష్యాన్ని తరిమికొడతాం.. సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఏ ప్రజా ఉద్యమమైనా నల్లగొండ ముందుంది.. కొండా లక్ష్మణ్‌బాపూజీ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, ధర్మభిక్షం వంటి యోధులు, శ్రీకాంతాచారి వంటి బిడ్డలు నడయాడిన నేల ఇది.. ఎందరో యోధులకు నిలయమైన ఈ జిల్లాను సస్యశ్యామలం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.. అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన పూర్తిచేసి తీరుతామని, అడ్డుకునేవారి సంగతిని ప్రజలే తేల్చాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రం వస్తే నల్లగొండ జిల్లా బాగుపడుతుందని భావించారని, కానీ సమైక్య రాష్ట్రంలో కంటే గడచిన పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలోనే ఎక్కువ వివక్షకు గురైందన్నారు. జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీని పదేళ్లు పూర్తిగా పక్కనబెట్టారని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫ్లోరైడ్‌పీడతోపాటు 3.50లక్షల ఎకరాలకు సాగునీరు, ఈ ప్రాంతాలకు తాగునీరు వచ్చేదన్నారు. వివక్షకు నిరసనగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 12కు 11 సీట్లలో భారీ మెజార్టీలతో కాంగ్రెస్‌ నేతలను గెలిపించారని, రెండు ఎంపీ సీట్లను అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. నల్లగొండ ఎంపీగా రఘువీర్‌ను దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించారని, అందుకు కృతజ్ఞతలు అన్నారు. తమ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికే నీటిపారుదలశాఖ బాధ్యత అప్పగించామని, ఆయన నేతృత్వంలో ఎస్‌ఎల్‌బీసీ మొదలు చిన్న ప్రాజెక్టుల వరకు అన్నింటినీ పూర్తిచేస్తున్నారని, నిధులను కూడా గ్రీన్‌ ఛానల్‌లో ఉంచి విడుదల చేస్తున్నామని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణవెల్లెంల, డిండి లిఫ్టు, మూసీ ప్రక్షాళన అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేస్తామన్నారు. రీజనల్‌ రింగురోడ్డు నిర్మాణం చేపడతామని, నల్లగొండకు ఔటర్‌ రింగురోడ్డు వెంకట్‌రెడ్డి నేతృత్వంలో మంజూరైందని పేర్కొన్నారు. నర్సింగ్‌ కళాశాల కూడా మంజూరైందని, త్వరలో డెంటల్‌ కళాశాల కూడా ఇస్తామని పేర్కొన్నారు. నల్లగొండకు ఏది అడిగితే అది ఇవ్వడం ఇందిరమ్మ ప్రభుత్వంగా తమ బాధ్యతని పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి తామంతా జట్టుగా పనిచేస్తామన్నారు.

సీఎం పర్యటన సాగుతుండగానే జీవోలు విడుదల

నల్లగొండ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగుతుండగానే మరోవైపున జిల్లాకు వివిధ పథకాలకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. జిల్లాలో ఐదు కీలకమైన రోడ్లకు రూ.204కోట్లు మంజూరు చేశారు. నల్లగొండలోని లతీఫ్‌ సాహెబ్‌ గుట్టపైకి ఘాట్‌రోడ్డుకు, బ్రహ్మంగారి మఠం శివాలయం రోడ్డుకు రూ.140కోట్లు, అనిశెట్టిదుప్పలపల్లి-ఖాజీరామారం రోడ్డు, నల్లగొండ-నకిరేకల్‌ పీడబ్ల్యూడీ పజ్జూరు రోడ్డ విస్తరణకు రూ.20కోట్లు, సాగర్‌రోడ్డు నుంచి కనగల్‌కు రూ.14కోట్లు, చర్లపల్లి నామ్‌ రోడ్డు నుంచి పిట్లంపల్లికి రూ.16కోట్లు, నార్కపల్లి నుంచి మండ్ర రోడ్డు విస్తరణకు రూ.14కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా దామరచర్ల నామ్‌ రోడ్డు నుంచి యాదాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌ వరకు నాలుగు లేన్ల నూతన సీసీరోడ్డు నిర్మాణానికి రూ.236కోట్లు మంజరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఉత్సాహంగా పాల్గొన్న నేతలు

సీఎం పర్యటనలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టివిక్రమార్క, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీలు కుందూరు రఘవీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నేనావత్‌ బాలూనాయక్‌, వేముల వీరేశం, మందుల సామేలు, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, ఉత్తమ్‌పద్మావతి, కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు కలెక్టర్‌ ఇలాత్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, కార్పొరేషన్ల చైర్మన్లు పటేల్‌ రమే్‌షరెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, అద్దంకి దయాకర్‌, పున్నాకైలాష్‌నేత, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సభ విజయవంతంతో జోష్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న సభ విజయవంతం కావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ నెలకొంది. ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లాలో ప్రతిష్ఠాత్మక బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకం, యాదాద్రిపవర్‌స్టేషన్‌లో తొలి యూనిట్‌లో విద్యుదుత్పత్తి, మెడికల్‌ కళాశాల భవనాలను సీఎం ప్రారంభించారు. వీటితోపాటు పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యమ చరిత్ర, ప్రగతి, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన పథకాలను, లక్ష్యాలను సీఎం వివరించడం సభికులను ఆకట్టుకుంది. ఉదయం నుంచే భారీగా జనం నియోజకవర్గాల నుంచి తరలివచ్చి కూర్చున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాలు ప్రారంభం కాగానే కార్యకర్తలు చప్పట్లతో కేరింతలు కొట్టారు. జిల్లా వ్యాప్తంగా జనసమీకరణ చేయడంతో నల్లగొండ పట్టణం కిక్కిరిసింది. అన్ని రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. పట్టణంలో నలువైపులా, అన్ని రహదారులను సీఎం స్వాగత ప్లెక్సీలతో నింపేశారు. సీఎం ప్రసంగం యావత్తూ జిల్లా గొప్పదనాన్నిచాటుతూ సాగడంతో పాటు, జిల్లాకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటడం సభికుల్లో చర్చకు దారితీసింది. జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని, తమ పార్టీని ఆదరించిన ఈ జిల్లా రుణం తీర్చుకునేలా పనిచేస్తామని సీఎం సహా మంత్రులు ప్రకటించారు. మొత్తంగా సభ ఘనంగా జరగడం, జనం భారీగా హాజరవడంతో మంత్రి, ఎమ్మెల్యేలు ఉత్సాహంగా కనిపించారు. ఇదిలా ఉండగా, విజయోత్సవ సభలో నల్లగొండ గద్దర్‌ నర్సిరెడ్డి తన ఆటపాటలతో అలరించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై, మంత్రి వెంకట్‌రెడ్డిపై ఆయన పాడిన పాటలు ఉత్సాహపరిచాయి.

నా జన్మ ధన్యమైంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నార్కట్‌పల్లి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): బీ.వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం జాతికి అంకితం కావడంతో తన జన్మ ధన్యమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సీఎం పర్యటన ముగిసిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు తన రాజకీయ స్వప్నంగా అభివర్ణించారు. రాష్ట్రంలో దశాబ్దకాలంలో మారిన రాజకీయ పరిణామాలతో ప్రాజెక్టు నిలిచిపోతే మనసు ఎంతో వేదనకు గురైందన్నారు. అంతకుముందు పైలాన్‌ స్తూపావిష్కరణ వద్ద కూడా సీఎం రేవంత్‌రెడ్డికి వెంకట్‌రెడ్డి మర్యాద పూర్వక నమస్కారం చేశారు. సీఎం కూడా కోమటిరెడ్డిని అభినందిస్తున్నట్టు ప్రతి నమస్కారం చేశారు.

Updated Date - Dec 08 , 2024 | 01:13 AM