Share News

ఓటు బ్యాంక్‌ తారుమారు

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:01 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల్లో ఆసక్తికర విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు ప్రధాన పార్టీల ఓట్లకు గణనీయమైన గండి పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ద్వితీయస్థానంలో కొనసాగిన బీఆర్‌ఎస్‌ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి సగానికిపైగా ఓటు బ్యాంకును కోల్పోయింది. బీజేపీ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరిగింది.

ఓటు బ్యాంక్‌ తారుమారు

గణనీయంగా తగ్గిన బీఆర్‌ఎస్‌ ఓట్లు

మెజార్టీలున్నా కాంగ్రె్‌సకూ తగ్గిన ఓట్లు

బీజేపీనీ వెంటాడిన సమన్వయలోపం

మూడు పార్టీల్లోనూ భిన్నమైన విశ్లేషణలు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ)

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల్లో ఆసక్తికర విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు ప్రధాన పార్టీల ఓట్లకు గణనీయమైన గండి పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ద్వితీయస్థానంలో కొనసాగిన బీఆర్‌ఎస్‌ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి సగానికిపైగా ఓటు బ్యాంకును కోల్పోయింది. బీజేపీ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు భారీగా మెజార్టీలు నమోదైనా, రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఓటింగ్‌ తగ్గింది.

ఉమ్మడి జిల్లాలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గంతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గంలో మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్‌ ఓటింగ్‌ తగ్గింది. ఈ తగ్గుదల కోదాడ, నల్లగొండల్లో స్వల్పంగా ఉండగా, మిగిలిన చోట్ల భారీగా ఉంది. నల్లగొండ లోక్‌సభ స్థానంలో అనూహ్యంగా ద్వితీయ స్థానంలోకి వచ్చిన బీజేపీకి ఆ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ కంటే తక్కువ ఓట్లు రాగా, సూర్యాపేట నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు ఈ ఎన్నికల్లో నమోదయ్యాయి. ఇలా పలు భిన్నమైన ఫలితాలు ఈ ఎన్నికల్లో వెలువడడంతో భవిష్యత్‌ రాజకీయం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.

బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంక్‌ తగ్గింది

ఉమ్మడి జిల్లాలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక అసెంబ్లీ స్థానాన్ని గెలవగా, మిగిలిన అన్ని చోట్లా ద్వితీయ స్థానంలో ఉంది. నల్లగొండ లోక్‌సభ పరిధిలో ఏడింట ఆరుచోట్ల ద్వితీయ స్థానంలో, సూర్యాపేటలో మొదటి స్థానంలో ఉన్న పార్టీ 33.13 శాతం ఓటు బ్యాంక్‌ సాధించింది. భువనగిరి లోక్‌సభ పరిధిలోని ఏడు సీట్లలోనూ ఆరింటిలో ద్వితీయ స్థానంలో ఉండి, 4,78,631 ఓట్లతో 36.39శాతం ఓట్‌ బ్యాంక్‌ను నిలబెట్టుకుంది. అయితే లోక్‌సభకు వచ్చేసరికి ఆ పార్టీ ఓట్‌ బ్యాంక్‌ పూర్తిగా పడిపోయింది. 2,18,417 ఓట్లతో 17.10శాతానికే పరిమితమైంది. భువ నగిరి లోక్‌సభ స్థానంలో ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 5,60,002 ఓట్లతో 36.39శాతం ఓటింగ్‌ను సాధించగా, లోక్‌సభకు వచ్చేసరికి 2,56,187 ఓట్లతో 18.45శాతానికి ఓట్‌ బ్యాంక్‌ పడిపోయింది. బీఆర్‌ఎ్‌సకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన వర్గాల్లో యువత, విద్యార్థులతో పాటు, హిందూత్వ భావజాలం ఉన్నవారు, కుల ప్రాతిపదికన కొందరు ఓటర్లు బీజేపీకి మళ్లడంతో పాటు, బీఆర్‌ఎస్‌ తరుపున సాగిన ప్రచారం కూడా ఆకట్టుకోలేకపోవడం, అభ్యర్థుల ప్రాధాన్యం అంతగా కనిపించకపోవడం, పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడపడంలో నాయకత్వం పట్టింపులేకుండా వ్యవహరించడం వంటి అంశాలు ఈ ఓట్‌ బ్యాంక్‌ తగ్గుదలకు కారణమయ్యాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

బీజేపీలో సమన్వయలోపం

ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ రెండో స్థానంలోకి దూసుకువచ్చింది. నల్లగొండ లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో 5.08శాతం ఓట్‌ బ్యాంక్‌ సాధిస్తే, ఎంపీ ఎన్నికల్లో 17.57శాతం ఓట్లు సాధించింది. బీఆర్‌ఎస్‌కంటే అరశాతం అధికంగా ఓట్లను రాబట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లు వచ్చిన నల్లగొండ (7,828), మిర్యాలగూడ (3,024) స్థానాల్లో ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను మించి ఓట్లు సాధించింది. నల్లగొండలో 51,451ఓట్లు వస్తే, మిర్యాలగూడలో 36,511ఓట్లు వచ్చాయి. సూర్యాపేటలో మాత్రం అసెంబ్లీ కంటే ఓట్లు తగ్గాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 40,407 ఓట్లు వస్తే, ఎంపీ ఎన్నికల్లో 32,615 ఓట్లే వచ్చాయి. పార్టీకి బలమైన నాయకత్వం, మొదటి నుంచి ఓట్‌ బ్యాంక్‌ ఉన్న నియోజకవర్గమైనా, నాయకత్వానికి, అభ్యర్థికి మధ్య ఉన్న గ్యాపే ఓటింగ్‌ తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లో మాత్రం బీజేపీ మూడో స్థానంతోనే సరిపుచ్చుకుంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ రెండోస్థానంలో నిలిచి 27,781 ఓట్లు సాధిస్తే, బీజేపీకి 21,777 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి, పార్టీ క్యాడర్‌, పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కుదిరితే సూర్యాపట జిల్లాలోనూ మరిన్ని ఓట్లు పెరిగేవని, భువనగిరి తరహాలో అన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలో ఉండేవాళ్లమని పార్టీ నేతలు చెబుతున్నారు.

రెండు చోట్ల మాత్రమే పెరిగిన కాంగ్రె్‌స ఓటింగ్‌

అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే, లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో హుజూర్‌నగర్‌, సూర్యాపేట మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఓట్లకు గండి పడింది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో 1,16,707 ఓట్లు వస్తే, ఎంపీ ఎన్నికల్లో 1,33,200 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ కంటే 16,493 ఓట్లు అధికంగా వచ్చాయి. అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ద్వితీయ స్థానంతో సరిపుచ్చుకొని 70,537 ఓట్లకు పరిమితమైతే, ఈ ఎన్నికల్లో పార్టీ ఏకతాటిపై నడవడం, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమే్‌షరెడ్డి వర్గవిభేదాలు వీడి పనిచేయడంతో ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ కంటే ఆధిక్యత సాధించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల కంటే 32,736 ఓట్లు అదనంగా ఈ నియోజకవర్గంలో సాధించింది.

అధికారపార్టీకి 10చోట్ల తగ్గిన ఓటింగ్‌

నల్లగొండ లోక్‌సభ పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత శాసనసభ ఎన్నికల కంటే ఎంపీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయి. మిర్యాలగూడలో 14,972 ఓట్లు కాంగ్రె్‌సకు తగ్గాయి. నాగార్జునసాగర్‌లో 12,739 ఓట్లు, దేవరకొండలో 11,265 ఓట్లు, నల్లగొండలో 2,775 ఓట్లు, కోదాడలో 1,283 ఓట్లు అధికార పార్టీ అభ్యర్థికి తగ్గాయి. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా కనిపించింది. ఆలేరు నియోజకవర్గంలో అసెంబ్లీ కంటే 45,410 ఓట్లు తగ్గాయి. నకిరేకల్‌ నియోజకవర్గంలో 36,626 ఓట్లు, తుంగతుర్తిలో 26,448 ఓట్లు, భువనగరిలో 28,423 ఓట్లు కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి తగ్గాయి. మునుగోడు అసెంబ్లీలోనూ 10,957 ఓట్ల తగ్గుదల కనిపించింది. భువనగిరి లోక్‌సభ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 38,493 ఓట్లు తగ్గగా, జనగామలోనూ స్వల్పంగా 7,160 ఓట్లు తగ్గాయి. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఊపు ఈ ఎన్నికలకు తగ్గిందని, ఇదే తగ్గుదల కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రతిపక్షాలకు అవకాశమిచ్చినట్లు అవుతుందని, ఈ తగ్గుదలపైనా అధిష్ఠానం సమీక్ష నిర్వహించాలని అధికార పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. అయితే కాంగ్రెస్‌ వ్యతిరేక ఓట్లలో బీజేపీ, బీఆర్‌ఎ్‌సకు చీలాయని, కాంగ్రె్‌సకు మంచి మెజార్టీ కనిపించినా, ప్రతిపక్షంగా ఒకే పార్టీకి ఓటర్లు మొగ్గితే మెజార్టీల్లోనూ గణనీయమైన తగ్గుదల కనిపించేదని, ఈ అంశాలను పార్టీ అగ్రనేతలు పరిశీలించాలని క్యాడర్‌లో చర్చ సాగుతోంది. మరి అధిష్ఠానం దీనిపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ ఓట్లు చీలకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.

Updated Date - Jun 07 , 2024 | 12:01 AM